దుబ్బాక ఉపఎన్నికల ప్రచారం హీటెక్కింది. ఇంకో వారం రోజుల్లో ప్రచారం కూడా ముగుస్తుంది. టీఆర్‌ఎస్ తరఫున మంత్రి హరీష్‌రావు అన్నీ తానై ప్రచారం సాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ప్రచారానికి వస్తే ఆ కిక్కే వేరని అనుకుంటున్నాయట అధికార పార్టీ శ్రేణులు. ముఖ్యమంత్రికి ఈ ప్రాంతంతో చాలా అనుబంధం ఉంది. ప్రచారానికి వస్తే టీఆర్‌ఎస్‌కు మరింత ప్లస్ అవుతాయని లెక్కలు వేస్తున్నారట.
తెలంగాణ ఏర్పాటైన తర్వాత వచ్చిన మూడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఒక్క నారాయణఖేడ్‌లోనే సీఎం కేసీఆర్ ప్రచారానికి వెళ్లారు. పాలేరు, హుజూరాబాద్ ప్రచారంలో పాల్గొనలేదు. ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నికలో భారీ మెజారిటీ కోసం పావులు కదుపుతోంది టీఆర్‌ఎస్. ఈ ప్లాన్ వర్కవుట్ కావాలంటే సీఎం వచ్చి.. మాట్లాడితే బాగుంటుందనేది పార్టీలో కొందరి అభిప్రాయం. పైగా దుబ్బాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు కేసీఆర్ తెలుసుకుంటున్నారట.
గతంలో కేసీఆర్ సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ నియోజకవర్గంలోని 11 గ్రామాలు ఇప్పుడు దుబ్బాకలో ఉన్నాయి. ఇప్పుడు సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ సైతం దుబ్బాక పక్కనే ఉంటుంది. చనిపోయిన రామలింగారెడ్డితో కేసీఆర్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే ప్రచారం గడువు ముగిసే చివరి రోజుల్లో ఓ భారీ బహిరంగ పెట్టి కేసీఆర్‌ను ఆహ్వానిస్తే అనుకున్న గోల్ చేరుకోవచ్చని అభిప్రాయపడుతున్నారట అధికార పార్టీ నేతలు. అధికార పార్టీ నాయకులు ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పాలని .. సీఎంకు సన్నిహితంగా ఉండేవారికి తెలిపారట. వారు చెప్పిన మీదట కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.