దసరా పండుగకు 14 రోజులు సెలవులొచ్చాయని విద్యార్థులు గంతులేశారు. హాయిగా జాలీగా గడపాలని డిసైడ్ అయ్యారు. ఈ 14 రోజులు ఎలా గడపాలో ప్లానింగ్ కూడా చేసుకున్నారు. కానీ వారి ఆశలన్నీ అడియాశలయ్యేలా ఉన్నాయి. దసరాకు 14 రోజుల బదులు తొమ్మిది రోజులే సెలవులివ్వాలని పాఠశాల విద్యాశాఖకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) సూచించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కరోనా వల్ల విద్యార్థులు చాలా వెనకబడి ఉన్నారు. మరోవైపు జులైలో వర్షాలు, సెప్టెంబర్ 17న పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ఏడు రోజులు పనిదినాలు తగ్గాయని, ఆ సెలవు దినాలను భర్తీ చేసేందుకు ఎస్‌సీఈఆర్‌టీ మరో ప్రతిపాదన పాఠశాల విద్యాశాఖ ముందు ఉంచింది. నవంబరు నుంచి ఏప్రిల్ వరకు రెండో శనివారాలు కూడా పాఠశాలలు పనిచేయాలని ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో దసరా సెలవులు ఈనెల 26 నుంచి కాకుండా.. అక్టోబర్ 1నుంచి ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఎస్‌సీఈఆర్‌టీ ప్రతిపాదనను పాఠశాల విద్యాశాఖ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.