కరోనా వైరస్ కారణంగా వాయిదాపడిన వివిధ ప్రవేశ పరీక్షలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. రాష్ట్ర, జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే సెట్ల సీబీటీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఈసెట్, మంగళవారం జేఈఈ మెయిన్ పరీక్షలు జరుగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం ప్రవేశాల కోసం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఈసెట్-2020 కంప్యూటర్ బేస్డ్ టెస్టు విధానంలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు 28,015 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. వారిలో దాదాపు 26,500 మంది హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. పరీక్షల కోసం తెలంగాణ, ఏపీలో కలిపి 56 కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. పరీక్ష సమయానికి గంట ముందుగానే కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు.
అదేవిధంగా దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కోసం మంగళవారం నుంచి సెప్టెంబర్ ఆరు వర కు జరుగనున్న జేఈఈ మెయిన్ పరీక్షలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐఐటీ ఢిల్లీ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సీబీటీ విధానంలో ఒక్కరోజులో 85 వేలమంది మెయిన్ పరీక్షలకు హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి 67,319 మంది, దేశవ్యాప్తంగా 8.58 లక్షల మంది పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్‌తోపాటు రంగారెడ్డి, నల్లగొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో పరీక్ష కేంద్రాలున్నాయి.