తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి కాసేపట్లో మరోసారి ఈడీ ఎదుట హాజరు కానున్నారు. నిన్న ఈడీ అధికారులు కోరిన వివరాలు ఇవాళ ఆయన వారికి అందించనున్నారు. ఈ మేరకు తన ఆడిటర్ వద్ద నుంచి పూర్తి పత్రాలు, వివరాలను రోహిత్ రెడ్డి తీసుకున్నారు. ఆయన అయ్యప్ప దీక్షలో ఉన్నందున భిక్ష తీసుకున్నాక (భోజన విరామం అనంతరం) ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. తన బ్యాంకు ఖాతాల వివరాలు, వాహనాలు, స్థిర, చరాస్తుల వివరాలను అధికారులకు ఇవ్వనున్నారు.
సోమవారం మధ్యాహ్నం ఈడీ విచారణకు హాజరైన రోహిత్ రెడ్డిని ఈడీ అధికారులు 6 గంటల పాటు విచారించారు. పలు వివరాలు సేకరించి.. నేడు మరోసారి విచారణకు రావాలని సూచించారు. ఈడీ అధికారులు తన వ్యక్తిగత వివరాలు, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారని రోహిత్ రెడ్డి తెలిపారు. తన వ్యాపార వివరాలు, ఫ్యామిలీ వివరాలు అడిగారని చెప్పారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. ఏ కేసులో నన్ను పిలుస్తున్నారనేది ఈడీ అధికారులు స్పష్టత ఇవ్వలేదన్న ఆయన.. నేడు మళ్లీ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారన్నారు.