అవినీతికి తావివ్వకుండా ఉండండి.. మంచి పాలనకు కేరాఫ్‌గా నిలవండి.. కనీసం ఏం మాట్లాడుతున్నామో అన్న స్పృహ ఒకటి తెచ్చుకుంటే చాలు.. ప్రజల ప్రాణాలకు భద్రత మాట దేవుడెరుగు ! గౌతమ్ సవాంగ్ అనే డీజీపీ వెళ్లిపోయిన తరువాత రాజేంద్ర నాథ్ రెడ్డి పదవీ బాధ్యతలు అందుకున్నారు.ఆ రోజు ఎలాంటి వివాదాలు ఉన్నాయో ఇప్పుడు కూడా ఆ తరహా వివాదలే నడుస్తున్నాయి. కానీ మంత్రుల తీరులో కానీ లేదా వాళ్లు విషయాన్ని అర్థం చేసుకుంటున్న రీతి కానీ అస్సలు బాలేదు. గతంలో బొత్స సత్య నారాయణ ఇప్పుడూ ఆయనే ! అలానే గతంలో కొడాలి నాని ఇప్పుడూ ఆయనే !
ఈవిధంగా తాజాలు మరియు మాజీలు కలిసి జగన్ కు తలనొప్పలు తెస్తున్నారు. వీరి కోవలోనే పోలీసులు చెబితే కానీ రాష్ట్రంలో సంచలనం రేపిన అత్యాచార బాధితురాలి వివరాలు ఆమెకు తెలియవు. తెలియకపోవడం తప్పు కాదు కానీ తెలుసుకోకపోవడం విచారకరం. అదే విధంగా అత్యాచార బాధితుల పరామర్శల్లో మాత్రం చొరవ ఉన్నా తరువాత నిందితుల విషయమై తీసుకుంటున్న చర్యలు ఏమంత గొప్పగా లేవు. కఠిన రీతిలో శిక్షలు పడితేనే సంబంధిత సంఘటనలకు నియంత్రణ ఉంటుందని పదే పదే పలువురు ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నా అవేవీ వినపడడం లేదు. గతం కన్నా ఇప్పుడు నేర ప్రవృత్తి బాగా ఉంది. దీనిని నియంత్రించాల్సిన బాధ్యత సర్కారుదే కానీ గౌరవ మంత్రులు పదవులు అందుకోగానే పెద్దవాళ్లం అయిపోయాం అని అనుకుంటున్నారో ఏంటో ? అస్సలు మానవత అన్నదే లేకుండా ప్రవర్తించడం నిజంగా జగన్ సర్కారు కు చెడ్డపేరే !
తిడితే పనులు అయిపోవు.. అదేవిధంగా అనాలోచితంగా మాట్లాడినంత మాత్రాన పనులు అయిపోవు. వివాదాల కారణంగా పరువు పోగొట్టుకున్న మాజీలు, అవే వివాదాలు అవే విధానాల కారణంగా ఇప్పుడిప్పుడే పదవుల్లో నిలదొక్కుకుంటున్న మంత్రులు మీడియా హెడ్ లైన్స్ షోలో బాగానే కనిపిస్తున్నారు. బాధితుల గోడు పట్టించుకోకుండా అడిగిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
ఇటీవల రేపల్లె లోజరిగిన అత్యాచార ఘటనపై హోం మంత్రి తానేటి వనిత చెప్పిన మాటలు అత్యంత బాధాకరంగా ఉన్నాయి. అనాలోచితంగా ఆమె మాట్లాడారు. ఇదే విధంగా గతంలోనూ మంత్రులు మాట్లాడారు. విపక్ష పార్టీలను ఉద్దేశించి మాట్లాడారు. అవి కూడా అనాలోచితం అయినవే ! వాటి కారణంగా పొలిటికల్ మైలేజ్ పెరగదు గాక పెరగదు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా నిరంతరం సీఎం జగన్ కు అనుకూలంగా భజన చేయడం విల్ల కూడా క్రేజ్ పెరగదు. ఇవన్నీ ఎవరికి వారు తెలుసుకోవాలి. కనీస స్థాయిలో విజ్ఞతను ప్రదర్శించాలి.
మంత్రులు మాట్లాడడం నేర్చుకుంటే చాలు సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయి. మాట కారణంగానే చాలా సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘటనల్లో ఎక్కువగా ఇరుకున పడుతున్నది మంత్రులే !
ఇప్పుడంటే మాజీలంతా సైలెంట్ అయిపోయారు కానీ వాళ్లు కూడా ఇదే విధంగా నోరు అదుపులోకి ఉంచుకోక ఏది పడితే అది మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి. గతంలో పేర్నినాని కానీ కొడాలి నాని కానీ అవంతి శ్రీను కానీ వెల్లంపల్లి శ్రీను కానీ వీళ్లంతా ఏవో మాట్లాడి ఏవేవో వివాదాలకు కారణం అయిన వారే ! ముఖ్యంగా టీడీపీ అధినేత పేరెత్తితే చాలు నోరేసుకుపడిపోయేవారు కొడాలి నాని.. నిన్నటి వరకూ ఆయనెక్కడ రాజకీయ పాఠాలు నేర్చుకున్నారో కూడా మరిచిపోయారా అని టీడీపీ ఆయనకు కౌంటర్లు ఇచ్చేది. చంద్రబాబును, లోకేశ్ ను ఉద్దేశించి చాలా తిట్లు తిట్టేవారు. ఆయనతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కూడా ఇలానే తిట్టేవారు. ఇవన్నీ ఎవరు చెబుతున్నారని? ఎవరి జీవితాలను ఇవి ప్రభావితం చేయనున్నాయని?