ఏపీలో అధికార వైసీపీ ఓట్లు తగ్గాయా? గత ఎన్నికలతో పోలిస్తే 10 శాతం ఓట్లు వైసీపీకి మైనస్ అయ్యాయా? అంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ అదే చెబుతున్నారు. వైసీపీకి 10 శాతం పైనే ఓట్లు తగ్గాయని అంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి 50 శాతం ఓట్లు పడితే..టిడిపికి 40 శాతం, జనసేనకు 6 శాతం వరకు ఓట్లు పడ్డాయి. ఇపుడు పరిస్తితులు మరాయని, వైసీపీకి వ్యతిరేకత ఉందని, అందుకే ప్రజలు జనసేన వైపు చూస్తున్నారని పవన్ అంటున్నారు.
జనసేనకు 20 శాతం వరకు ఓట్లు పెరిగాయనేది పవన్ అంచనా. అంటే రాయలసీమ జిల్లాలు పక్కన పెట్టి..కోస్తా, ఉత్తరాంధ్ర వరకు చూసుకుంటే జనసేనకు 20 శాతం ఓట్లు ఉన్నాయని పవన్ అంటున్నారు. ఈ లెక్కన వైసీపీకి 40 శాతం, టిడిపికి 40 శాతం ఓట్లు అలాగే ఉన్నాయనే లెక్కల్లో ఉన్నారు. అయితే ఈ లెక్కలు కేవలం పవన్ వేసుకున్నవే. అందులో వాస్తవం ఎంతవరకు ఉన్నదనేది క్లారిటీ లేదు. అయితే ఇప్పుడున్న పరిస్తితుల్లో వైసీపీ ఓటు బ్యాంకు కాస్త తగ్గిన మాట వాస్తవమే. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు కాస్త వైసీపీకి ఓట్లు తగ్గాయి.
అలా అని ఎక్కువ స్థాయిలో ఓట్ల శాతంలో మార్పు లేదని చెప్పవచ్చు. గట్టిగా చూసుకుంటే 3-4 శాతం అని విశ్లేషకులు అంటున్నారు. ఇక టిడిపికి 40 శాతం వరకు ఓటు బ్యాంకు ఉందని, జనసేనకు గట్టి గా చూసుకుంటే 10 శాతం వరకు ఓట్లు పెరుగతాయి తప్ప..20 శాతం మాత్రం కష్టమే అంటున్నారు.
అయితే అటు టిడిపి లెక్కలు వేరుగా ఉన్నాయి. తమ పార్టీకి ఓటు బ్యాంకు 45 శాతం వరకు వెళ్లిందని, వైసీపీకి 42-43 శాతం వరకు ఉందని లెక్కలు వేస్తున్నారు. జనసేనకు 8-9 శాతం వరకు ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఇలా ఎవరికి లెక్కలు వారికి ఉన్నాయి. కానీ అసలు లెక్కలు అనేవి ప్రజలు తేలుస్తారు. కాకపోతే టిడిపి, జనసేన కలిస్తే మాత్రం ఓటు బ్యాంకు భారీగానే ఉంటుంది..వైసీపీని దాటే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఎంత మద్ధతు ఇస్తారో.