రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలే కాదు..కేంద్ర రాజకీయాలు కూడా వేడెక్కాయి. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అటు బిజేపి..మిత్రపక్షాలు..ఇటు కాంగ్రెస్, మిత్రపక్షాలు హోరాహోరీగా తలపడటానికి రెడీ అవుతున్నాయి. అయితే గత రెండు ఎన్నికల్లో వన్‌సైడ్ గా గెలుస్తూ..రెండుసార్లు అధికారంలో కూర్చున్న బిజేపికి చెక్ పెట్టాలని కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే బిజేపికి వ్యతిరేకంగా ఉన్న బలమైన విపక్షాలు..ఆప్, ఎస్పీ, డిఎంకే, టిఎంసి, జేడియూ, ఆర్‌జేడి ఇలా ఇతర విపక్షాలు అన్నీ ఏకమవుతున్నాయి. కాంగ్రెస్ తో కలిసి రానున్న ఎన్నికలని ఎదురుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇప్పటికే విపక్షాల ఐక్య మీటింగ్ పాట్నాలో సిఎం నితిశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగాయి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరులో విపక్షాల ఐక్య మీటింగ్ జరుగుతుంది. కాంగ్రెస్ సహ దాదాపు 20 పైనే విపక్ష పార్టీలు ఈ సమావేశంలో పాల్గొంటాయని తెలుస్తుంది. ఇక వీరి టార్గెట్ ఒక్కటే..రానున్న ఎన్నికల్లో మోదీని గద్దె దించి..తాము అధికారంలోకి రావడం. ఈ క్రమంలో బిజేపికి చెక్ పెట్టడానికి విపక్షాలు ఐక్యంగా ఎలా పోరాడాలి సీట్ల పంపకాలపై ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై చర్చించనున్నారు.
విపక్షాల దూకుడు నేపథ్యంలో బిజేపి కూడా అలెర్ట్ అయింది. గత రెండు ఎన్నికల్లో సొంత బలంతో అధికారంలోకి వచ్చింది. ఈ సారి ఆ పరిస్తితి వచ్చేలా లేదు. అందుకే తమ మిత్రపక్షాల బలం పెంచుకునే దిశగా వెళుతుంది..ఈ క్రమంలోనే ఎన్డీయే పక్షాల మీటింగ్ పెట్టింది. బిజేపితో సహ 30 పార్టీలు ఈ సమావేశంలో పాలగొంతున్నాయి.
అయితే అటు యూపీఏ సమావేశానికి గాని, ఇటు ఎన్డీయే సమావేశానికి గాని తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రధాన ప్రాంతీయ పార్టీలు టిడిపి, బిఆర్‌ఎస్, వైసీపీలకు ఆహ్వానం రాలేదు. బిజేపితో పొత్తులో జనసేనకు ఎన్డీయే మీటింగ్‌కు ఆహ్వానం వచ్చింది. దీంతో పవన్ ఆ సమావేశానికి వెళుతున్నారు. మరి ఈ సమావేశం తర్వాత ఏపీలో పొత్తుల ఎలా మారతాయో చూడాలి. మొత్తానికి ఈ సారి ఎన్డీయే, యూపీఏల మధ్య పోరు హోరాహోరీగా జరగడం ఖాయం.