ఉచిత కరెంట్ రివర్స్ షాక్..కొట్టింది ఎవరికి?

-

వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అంశంపై ఏ పార్టీ వాదన నెగ్గింది..ప్రజలు ఎవరి మాటలని ఎక్కువ నమ్మారు? అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ వైపు నిలబడ్డారా? లేక కాంగ్రెస్‌కు మద్ధతు ఇచ్చారా? అంటే ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. ఉచిత విద్యుత్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మొదట చర్చకు దారితీసాయి. అమెరికాలో ఆయన ఎన్‌ఆర్‌ఐలతో మాట్లాడుతూ..3 ఎకరాలకు 3 గంటల కరెంట్ చాలు అని, సరాసరిన రోజుకు 8 గంటలు అవసరమవుతుందని అన్నారు. 24 గంటల కరెంట్ వద్దని చెప్పలేదు.

కానీ అదిగో రేవంత్ 3 గంటలే అంటున్నారని, తాము 24 గంటల కరెంట్ ఇస్తున్నామని, కాంగ్రెస్ రైతు ద్రోహుల పార్టీ అని కే‌టి‌ఆర్ విమర్శలు చేశారు. మధ్యలో చంద్రబాబుని లాగి రేవంత్ పై విరుచుకుపడ్డారు. ఇక రేవంత్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తన మాటలని వక్రీకరించారని, అసలు ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ అని, కే‌సి‌ఆర్ సర్కార్..24 గంటల పేరు చెప్పి 12 గంటల కూడా ఇవ్వడం లేదని, తాను బాబు మనిషిని అయితే…కే‌సి‌ఆర్ ఎక్కడ నుంచి వచ్చారు? అని బి‌ఆర్‌ఎస్ లో సగం మంది టి‌డి‌పి వాళ్ళే అన్నారు.

సరే బాబు విషయం పక్కన పెడితే…ఉచిత విద్యుత్ పై రేవంత్ వ్యాఖ్యలకు కే‌టి‌ఆర్ నిరసన తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కానీ పెద్దగా స్పందన రాలేదు. అటు కాంగ్రెస్ సైతం కే‌సి‌ఆర్ సర్కార్ 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని, కావాలంటే విద్యుత్ సబ్ స్టేషన్లలో లాగ్ బుక్‌లని పరిశీలించాలని సవాల్ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్ని చోట్లకు వెళితే 24 గంటల కరెంట్ రావడం లేదని తేలింది.

పైగా  రైతులకు 24 గంటలూ అక్కర్లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడారు. ఎన్ని గంటలనేది కాదు.. నాణ్యమైన విద్యుత్తు ఇస్తున్నామని ట్రాన్స్‌కో సీఎండీ అన్నారు. దీని బట్టి చూస్తే 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని తేలింది. కాంగ్రెస్ రివర్స్ అవ్వడంతో అన్ని జిల్లాల్లోనూ సబ్‌స్టేషన్లలోని లాగ్‌బుక్కులను మార్చేస్తున్నారు.

మొన్నటివరకు 12 గంటలు ఇస్తే..ఇప్పుడు 20 గంటల పైనే సరఫరా చేస్తున్నారు. కాంగ్రెస్‌ ఎదురుదాడి చేయడంతో త్రీఫేజ్‌ కరెంటు సరఫరాలో మార్పులు చేశారు. మొత్తానికి కే‌సి‌ఆర్ సర్కార్ 24 గంటల కరెంట్ ఇవ్వలేదని తేలింది. గతంలో కాంగ్రెస్ కూడా పూర్తిగా ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో ప్రజలే తేల్చుకోవాలి. ఓట్లతో వారు ఎవరికి షాక్ ఇస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version