ఎడిట్ నోట్ : జ‌గ‌న్ ఎందుకు ఫెయిల్ ? ఎందుకు పాస్ ?

-

మామూలుగానే కాదు చాలా సంద‌ర్భాలలో పార్టీలలో చ‌ర్చ‌లు జ‌రుగుతుంటాయి. కానీ కొన్ని చ‌ర్చ‌లు మాత్ర‌మే రాగ‌ద్వేషాల‌కు అతీతంగా, స‌హేతుక‌త‌కు అద్దం ప‌ట్టే విధంగా జ‌రుగుతుంటాయి. వాటి కార‌ణంగా మంచి ఫ‌లితాలు కూడా వ‌స్తాయి. కొన్ని చ‌ర్చ‌ల కార‌ణంగా ప్ర‌భుత్వాల తీరు కూడా మారుతుంది. అనూహ్య మార్పులు వ‌చ్చిన దాఖ‌లాలు గ‌తంలో ఉన్నాయి. కొందరు ముఖ్య‌మంత్రులు అయితే విష‌య నిపుణుల‌తో మాట్లాడేందుకు ఎక్కువ ఇష్ట‌ప‌డుతుండే వారు.

అస‌లు కేసీఆర్ ను ఇంత‌టి స్థాయికి తీసుకువ‌చ్చిందే ఆ విష‌య నిపుణులు. ఆయ‌న‌కు పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ తెలిసినా కూడా విష‌య జ్ఞానం కూడా చాలా వాటిపై చాలా త‌క్కువ. అటువంటిది ఆయ‌న గంట‌ల త‌ర‌బ‌డి చ‌ర్చించి త‌నకు తెలియ‌ని విష‌యాల‌న్నింటినీ తెలుసుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ వెన‌క‌బాటు త‌నంపై పూర్తి అధ్య‌య‌నం చేశారు. స‌మ‌గ్ర అధ్య‌యనం అని రాయాలి. ఆ విధంగా ఆయ‌న ఎంతో నేర్చుకున్నారు. బిడ్డ‌ల‌నూ అదే విధంగా తీర్చిదిద్దారు. ఇవాళ క‌విత కానీ రామారావు కానీ మంచి స్థానంలో ఉన్నారంటే, మంచి స్థానంలో ఉండి స‌హేతుక రీతిలో మాట్లాడ‌గ‌లుగుతున్నారంటే అందుకు కార‌ణం విష‌య జ్ఞాన‌మే వారి విజ‌య సోపానం.

ఇక ఏపీ విష‌యానికే వ‌స్తే జ‌గ‌న్ కొన్ని విష‌యాల్లో పాస్ కొన్ని విష‌యాల్లో ఫెయిల్ అవుతున్నారు. ఇచ్చిన మాట ప్ర‌కారం జాబ్ క్యాలెండ‌ర్ వేయ‌లేక‌పోయారు. అమ‌లు మాటే మరిచిపోయారు. కానీ సంక్షేమ ప‌థ‌కాల‌కు సంబంధించి ఒక క్యాలెండ‌ర్ అనౌన్స్ చేశారు. ఆ విధంగా ఆ క్యాలెండ‌ర్ ను ఫాలో అవుతూ సంక్షేమ ప‌థ‌కాల‌కు నిధుల‌ను దిగ్విజ‌యంగా విడుద‌ల చేస్తున్నారు. ఆ విధంగా పాస్ మ‌రో విధంగా ఫెయిల్.

విష‌య జ్ఞానం అన్న‌ది విజ‌య సోపానం అని ఇదివ‌ర‌కు చెప్పిన విధంగానే జ‌గ‌న్ చాలా విష‌యాల్లో అవ‌గాహ‌న లేమితోనే ఉన్నారు. ఆయ‌నే కాదు ఆయ‌న చుట్టూ మంత్రులు, ఇత‌ర నాయ‌కులు కూడా ! ముఖ్యంగా సాగునీటి అంశాల‌పై అస్స‌లు ప‌ట్టు లేదు. ఇంకా చెప్పాలంటే ఈ రాష్ట్ర భౌగోళిక స్వ‌రూపంపై, ఇక్క‌డి నేల‌ల స్వ‌భావంపై ఇంకా చెప్పాలంటే ఇక్క‌డి పంట‌ల‌పై వేటిపై కూడా ఆయ‌న‌కు పూర్తి స్థాయి అవ‌గాహ‌న లేదు. ఇంకా చెప్పాలంటే సంబంధిత ప‌రిభాష ఆయ‌నకు తెలియ‌దు. అంబ‌టికీ తెలియ‌దు. అందుకే మంత్రులే కాదు ముఖ్య‌మంత్రి కూడా ఎంతో నేర్చుకోవాలి. అడ్మిన్ లో జ‌గ‌న్ ఫెయిల్.. మంత్రుల‌ను కంట్రోల్ చేయ‌డంలో జ‌గ‌న్ పూర్తిగా ఫెయిల్ కానీ ప‌వ‌న్ ను తిట్టించ‌డంలో మాత్రం జ‌గ‌న్ పాస్. ఆ విధంగా ఫెయిల్ మ‌రో విధంగా పాస్.

కొన్ని పాల‌న సంబంధ విష‌యాల్లో కొన్ని సార్లు పాస్.. ఎలా అంటే వేత‌న సవ‌ర‌ణకు సంబంధించి తానేం చెప్పానో చివ‌రి వ‌ర‌కూ అదే క‌ట్టుబ‌డి ఉంటాన‌ని చ‌ర్చ‌లు తుది ద‌శ‌కు వ‌చ్చిన‌ప్పుడు జ‌గ‌న్ నిర్ణ‌యించారు. ఆ నిర్ణ‌యం మేర‌కు ఆయ‌న పాస్. ఇక సీపీఎస్ ర‌ద్దు విష‌య‌మై చంద్ర‌బాబు చేసిన విధంగా మంత్రుల క‌మిటీతో కాల‌యాప‌న చేస్తున్నారు ఆ విధంగా ఫెయిల్.

విద్యా వైద్య రంగాల‌కు నిధుల కేటాయింపులో కొంత ఫెయిల్.. నాడు నేడు కొంత బాగుంది క‌నుక జ‌గ‌న్ పాస్. వైద్య రంగానికి కేటాయింపులు బాగున్నా సంబంధిత నిధుల విడుద‌ల లేదు క‌నుక ఫెయిల్ . అదేవిధంగా క‌రోనా వ‌ర‌కూ మిగ‌తా రాష్ట్రాల‌తో పోలిస్తే కొన్ని చ‌ర్య‌లు బాగున్నాయి.. కొన్ని బాగాలేవు.. క‌నుక ఆ విధంగా పాస్ మ‌రో విధంగా ఫెయిల్.. మ‌రి ! జ‌గ‌న్ ముంద‌స్తుకు పోయి, మ‌ళ్లీ గెలిచి త‌న నాయ‌కులకు, కార్య‌క‌ర్త‌ల‌కూ మ‌ళ్లీ ముద్ద పప్పు అన్నం తినిపిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

అవి నిజం అయితే మాత్రం జ‌గ‌న్ త‌న‌ని తాను తీర్చిదిద్దుకోవాల్సింది ఎంతో. ఒక‌వేళ ఆయ‌న మ‌ళ్లీ గెలిస్తే మాత్రం ఆయ‌న‌కు తిరుగేలేదు. అయినా విష‌యావ‌గాహ‌న పెంపొందించుకోవాలి. తెలుగు ఉచ్ఛార‌ణ‌లో దోషాలు స‌వ‌రించుకోవాలి. తెలుగు సంస్కృతుల ప‌రిర‌క్ష‌ణ‌కు మరింత శ్ర‌ద్ధ వ‌హించాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version