ఏపీలో ఎన్నికల కోలాహలం కనిపిస్తుంది. ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. అందుకు తగ్గట్టుగానే అధికార పార్టీ రాజకీయాలు ఉంటున్నాయి. ముందస్తుకు వెళ్ళేందుకే జగన్ రెడీగా ఉన్నారనే ప్రచారం వస్తుంది. జగన్ భారీ సభలతో ప్రజలతో ఉంటున్నారు..పథకాల పేరిట బటన్ నొక్కడం, అభివృధ్ది పనులకు శ్రీకారం చుట్టడం చేస్తున్నారు. అయితే ముందస్తు ఎన్నికలని దృష్టిలో పెట్టుకునే జగన్ ఇలా ముందుకెళుతున్నారని తెలుస్తుంది.
దీంతో ప్రతిపక్షమైన టిడిపి సైతం అలెర్ట్ అయింది. మొదట నుంచి చంద్రబాబు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతూనే ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన రెడీగా ఉండాలని టిడిపి నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే అభ్యర్ధులని ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు. అటు మినీ మేనిఫెస్టోని సైతం ప్రకటించి దూకుడు ప్రదర్శిస్తున్న విషయ తెలిసిందే. ఇలా జగన్, బాబు సైతం ఎన్నికల రణరంగంలోకి దిగేసినట్లే కనిపిస్తున్నారు. ఇక ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాస్త వెనుకబడ్డారు.
మార్చి నెలలో జనసేన ఆవిర్భావ సమయంలోనే ప్రజల్లో ఉన్నారు..తర్వాత సినిమా షూటింగ్ ల్లో బిజీ అయిపోయారు. అయితే ఇప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తాయనే నేపథ్యంలో పవన్ సైతం ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని రంగంలోకి దిగారు. జూన్ 14 నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అన్నవరం నుంచి భీమవరం వరకు మొదట విడత టూర్ కొనసాగనుంది. ఓ రకంగా ఇది ఎన్నికల ప్రచారమే అని చెప్పాలి.
తన వారాహి బస్సుతో..ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరంలో సత్యదేవుని వద్ద వారాహికి పూజలు చేయించి.. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి యాత్ర మొదలుపెడతారు. పిఠాపురం, కాకినాడ, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో యాత్ర ఉంటుంది. అయితే పవన్ అధికారంలోకి రావాలని టిడిపితో పొత్తుకు రెడీ అయిన విషయం తెలిసిందే.
ఇక దాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్..పొత్తు కూడా చూసుకుని..పొత్తులో భాగంగా జనసేనకు ఏ సీట్లు అయితే దక్కే ఛాన్స్ ఉందో ఆ సీట్లలోనే పవన్ టూర్ ఉండనుంది. పిఠాపురం, రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ రూరల్, సిటీ, నరసాపురం, భీమవరం, ప్రత్తిపాడు, పి. గన్నవరం సీట్లని పొత్తులో భాగంగా జనసేన అడిగే ఛాన్స్ ఉంది. మొత్తానికి టిడిపితో కలిసి జగన్‌ని గద్దె దించి అధికారం దక్కించుకోవాలనే దిశగానే పవన్ ముందుకెళుతున్నారు.