ఏపీలో పొత్తులు దిశగా ప్రతిపక్ష పార్టీలు ముందుకెళుతున్నాయి. దాదాపు టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అయిపోయిందనే చెప్పవచ్చు. ఇటీవలే చంద్రబాబు-పవన్ రెండు సార్లు కలిశారు..ఇక తాజాగా శ్రీకాకుళం సభలో ఒంటరిగా వెళ్ళి వీర మరణం పొందడం కంటే..వ్యూహం ప్రకారం పొత్తులో వెళ్ళడం బెటర్ అని పవన్ వ్యాఖ్యానించారు. ఇటు పవన్ మాటలని బాబు సమర్ధించారు. దీంతో రెండు పార్టీల పొత్తు ఫిక్స్ అయిందని చెప్పవచ్చు.
ఇక టీడీపీ-జనసేన పొత్తు ఉంటే అధికార వైసీపీకి కాస్త రిస్క్ పెరుగుతుంది..అందులో ఏ మాత్రం డౌట్ లేదు. నెక్స్ట్ ఎన్నికల్లో పరిస్తితి ఎలా ఉందనేది పక్కన పెడితే…ముందు టీడీపీ-జనసేనతో బీజేపీ కలుస్తుందా? లేదా? అనేది కొత్త చర్చ మొదలైంది. ఎందుకంటే ప్రస్తుతం జనసేన-బీజేపీ పొత్తులో ఉన్నాయి. జనసేన ఏమో టీడీపీతో పొత్తుకు రెడీ అవుతుంది. కాకపోతే పవన్…బీజేపీని ఒప్పించి టీడీపీతో కలిసి ముందుకెళ్లెలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
కానీ బీజేపీ మాత్రం టీడీపీతో కలిసే ప్రసక్తి లేదని, గతంలో పొత్తు పెట్టుకుని పలుమార్లు మోసపోయామని, ఈ సారి ఆ పరిస్తితి రానివ్వమని బీజేపీ నేతలు అంటున్నారు. అటు బీజేపీ అధిష్టానం సైతం..టీడీపీతో పొత్తుకు రెడీగా ఉన్నట్లు కనబడటం లేదు. అదే సమయంలో ఏపీలో ఒక శాతం ఓట్లు కూడా లేని బీజేపీతో పొత్తు వల్ల ప్రయోజనం లేదని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. పైగా రాష్ట్రాన్ని ఆదుకోని బీజేపీతో పొత్తు టీడీపీకే నష్టమని అంటున్నారు.
కాకపోతే కేంద్రం సపోర్ట్ ఉంటుందనే వాదన కూడా వస్తుంది. ఇప్పటికే రఘురామకృష్ణంరాజు లాంటి వారు టీడీపీ-జనసేనలతో బీజేపీ కలుస్తుందని అంటున్నారు. కానీ ఇటు బీజేపీ నుంచి ఆ సిగ్నల్స్ లేవు. అటు టీడీపీ వాళ్ళు కూడా జనసేన చాలు..బీజేపీ వద్దని అంటున్నారు. పైగా మూడు పార్టీలు కలిస్తే..అదిగో అన్నీ కలిసి తమపై కుట్రలు చేస్తున్నాయని, జగన్ ఒంటరిగా పోరుకు దిగుతారని వైసీపీ శ్రేణులు సెంటిమెంట్ లేపే ప్రయత్నం చేస్తారు. కాబట్టి బీజేపీ కలవడంపై ఆచి తూచి అడుగులేయాల్సిన అవసరం ఉంటుంది. చూడాలి చివరికి టీడీపీ-జనసేనలతో బీజేపీ కలుస్తుందో లేదో.