మళ్లీ అడిగారు మళ్లీ మళ్లీ అరిచారు కానీ కేంద్రం పట్టించుకోవడం లేదు. ఓ ప్రముఖ శాస్త్రవేత్తకో లేదా విద్యావేత్తకో లేదా పరిశోధకుడికో భారత రత్న ఇవ్వండి అని అడగరేం. ఇవన్నీ వదిలి పాపం ఎప్పుడో మన మధ్య నుంచి వెళ్లిపోయిన ఎన్టీఆర్ కు మాత్రం భారత రత్న ఇవ్వాలని కోరుకోవడంలో అర్థం ఉందా? రాజకీయాల్లో భాగంగా కూడా కొందరికి పురస్కారాలు రావొచ్చు గాక అయినప్పటికీ దేశం గౌరవించే అత్యున్నత పురస్కారం ఎన్టీఆర్ కు ఎందుకు? కళారంగంలో కృషి చేసినందుకు ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని అనుకుంటే ఆయన కేవలం తెలుగు భాషకు మాత్రమే పరిమితం అయిన నటుడు.
పోనీ రాజకీయ రంగంలో విశిష్ట సేవలు అందించారా ? అంటే అదీ లేదు. కేవలం ఆయన ఉమ్మడి ఆంధ్రాకు మాత్రమే పరిమితం అయిన రాజకీయ నాయకుడు. నేషనల్ ఫ్రంట్ పేరిట రాజకీయాలను జాతీయ స్థాయిలో నడిపినా కూడా పెద్దగా ప్రభావం చూపలేని నాయకుడు. ఏ విధంగా భారత రత్న. ఇప్పటికే పీవీకి భారత రత్న ఇవ్వాలని డిమాండ్ ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఇదే పట్టుబడుతోంది కూడా! ఉన్నంతలో పీవీ కుమార్తె వాణికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కేసీఆర్. అదేవిధంగా పీవీ జయంతినో వర్థంతినో వీలున్నంత వరకూ బాగానే చేస్తున్నారు. అధికారికంగానే వీటి నిర్వహణ ఉంటుంది. అదేవిధంగా ఆ రోజు చంద్రబాబు అధికారంలో ఉన్నా కూడా ఎన్టీఆర్ జయంతినో వర్థంతినో అధికారికంగా చేసిన దాఖలాలు లేవు.
పార్లమెంట్ సెంట్రల్ హాల్ ప్రాంగణంలో కూడా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు అన్నది ఆయన కుమార్తె అప్పటి కాంగ్రెస్ నాయకురాలు పురంధరి కారణంగానే సాధ్యమైంది. అందులో చంద్రబాబు ప్రతిభ కానీ చొరవ కానీ లేవని ఇవాళ్టికీ కాంగ్రెస్, బీజేపీ తో సహా ఇంకా ఇతర నాయకులు విమర్శిస్తారు. అలాంటిది ఎన్టీఆర్ పేరిట భారత రత్న ఎలా అడుగుతారని? వాస్తవానికి ఎన్టీఆర్ పేరిట జాతీయ పురస్కారం ఒకటి ప్రకటించి కొంతమందికి అందించారు.ఆ ప్రదానోత్సవం కూడా ఎందుకనో ఆగిపోయింది. 2016లో రజనీకాంత్ కు అందించారు.అది మినహా ఆ కార్యక్రమం కూడా అప్పటి నుంచి ఆగిపోయింది.
ఇది ఆంధ్రప్రదేశ్ తరఫున అందించే పురస్కారం. చంద్రబాబు హయాంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఒక్కసారే అందించారు. 1996లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన ఈ పురస్కారం ఇరవై ఏళ్ల పాటు నిరాటంకంగానే నడిచింది. ఆ తరువాత ఎందుకనో ఆగిపోయింది. ఈ పురస్కార సంరంభాన్ని ఇప్పుడు జగన్ కూడా కొనసాగించి ఎన్టీఆర్ పై ఉన్న గౌరవాన్ని చాటుకోవచ్చు.ఇదే పని టీడీపీ కూడా చేయవచ్చు. కానీ చేయరు.. కేవలం భారత రత్న అన్న డిమాండ్ ను మాత్రమే తెరపైకి తెచ్చి సంతృప్త పడతారు.