- ఖండించిన ఎడిటర్స్ గిల్డ్
న్యూఢిల్లీ : ప‌్రజా సమస్యలు, ప‌్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే వార్తలను కవరేజీ చేస్తున్న మీడియా సంస్థలు, పాత్రికేయులపై ప్రభుత్వాలు పరోక్షంగా బెదిరింపు చర్యలకు దిగుతున్నాయి. తాజాగా కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతుల ఉద్యమాన్ని కవరేజీ చేసిన పలువురు జర్నలిస్టులపై పోలీసులు దేశద్రోహం కేసులు నమోదుచేశారు. దీనిని భారత ఎడిటర్స్ గిల్డ్ తీవ్రంగా ఖండించింది.
వివరాల్లోకెళ్తే.. సాగు చట్టాల నేపథ్యంలో రైతన్నలు గణతంత్ర దినోత్సవం రోజున ట్రాక్టర్ పరేడ్ నిర్వహించారు. ఇది హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఈ హింసాత్మక ఘటనలపై వార్తల కవరేజీ ఇచ్చిన జర్నలిస్టులపై నోయిడా పోలీసులు దేశద్రోహం కేసులు నమోదు చేశారు. దీనిని ఎడిటర్స్ గిల్డ్ తీవ్రంగా ఖండించింది. ఈ చర్యలు ఖచ్చితంగా మీడియాను బెదిరించడం, వేధించడంతో పాటు అణచివేసే ప్రయత్నంలో భాగమేనని స్పష్టం చేసింది.
జర్నలిస్టులపై నమోదు చేసిన దేశద్రోహం కేసులను వెంటనే విరమించుకోవాలని యూపీ పోలీసులను డిమాండ్ చేసింది. దేశద్రోహం కేసులు నమోదైన వారిలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌తో పాటు జర్నలిస్టులు రాజ్‌దీప్ సర్దేశాయ్, మృణాలు పాండే తదితరులు ఉన్నారు. దేశద్రోహంతో పాటు పదిరకాల సెక్షన్ల కింద కేసులు నమోదుచేసినట్టు సమచారం.