ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో అధికార విపక్షాలు ప్రచార జోరు పెంచాయి. ఈ ఎన్నికలు రెండు పార్టీలకు చాలా కీలకం. దీనితో ఎలా అయినా సరే విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నాయి రెండు పార్టీలు. ఈ క్రమంలోనే రెండు పార్టీల నేతలు… ఓటర్లను ప్రలోభ పెట్టడానికి సిద్దమయ్యారు. డబ్బు పంచె వాళ్ళు డబ్బు ఇస్తుంటే కొంత మంది చీరలు, జాకెట్ ముక్కలు పంచి పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు.
తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఒకరు ఇలాగే చీరలు పంచి పెట్టి ఎన్నికల సంఘానికి దొరికిపోయారు. అనంతపురం జిల్లా తాడి పత్రీ నియోజకవర్గ ఎమ్మెల్యే గా ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి ఓటర్లను ప్రలోభ పెట్టడానికి గానూ చీరలు పంచి పెడుతున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందడం తో రంగంలోకి దిగిన ఎన్నికల సంఘం క్షేత్ర స్థాయిలో విచారణ చేసింది. ఆయన కొన్ని వార్డుల్లో ఈ కార్యక్రమం చేసారని గుర్తించింది.
దీనితో ఒక రోజు పాటు ఆయన ప్రచారానికి దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదిలా ఉంటే టీడీపీ నేతలు జేసి బ్రదర్స్ కి తాడిపత్రి నియోజకవర్గం కంచుకోటగా ఉంది. ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ పాగా వేసింది. ఎలా అయినా సరే జేసి బ్రదర్స్ ని ఓడించాలి అనే సిఎం జగన్ ఆదేశాలతో వైసీపీ నేతలు గట్టిగానే కష్టపడి వారిని ఓడించారు. 2019లో ఓటమి చవిచూసిన జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి… ఈసారి తాడిపత్రిలో కౌన్సిలర్‌గా బరిలోకి దిగడం గమనార్హం.