గత బీఆర్ఎస్ హయాంలో మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామంలో నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అందులో లబ్దిదారులు నివాసం ఉంటున్నారు. అయితే, సోమవారం రాత్రి డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీలో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు.
కరెంట్ కట్ చేయడంతో రాత్రంతా కాలనీ వాసులు చీకట్లోనే గడిపాల్సి వచ్చింది. తేళ్లు, పాములు కరుస్తాయేమోనని బిక్కు బిక్కు మంటూ కాలనీ వాసులు గడిపినట్లు సమాచారం. దీంతో తమకు సరైన సదుపాయాలు కల్పించాలని డబుల్ బెడ్రూం కాలనీ వాసులు వేడుకుంటున్నారు. మంగళవారం ఉదయం కాలనీలోని ప్రధాన రోడ్డెక్కి ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.