ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ మరో బాంబ్ పేల్చారు. ఆ కంపెనీ విధానపరమైన మార్పులకు సంబంధించి నిర్వహించే పోల్‌లో కేవలం ట్విటర్ బ్లూ సబ్‌స్క్రైబర్లు మాత్రమే పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి త్వరలోనే మార్పులు చేయనున్నట్లు వెల్లడించారు.
ట్విటర్ సీఈవోగా తాను తప్పుకోవాలా వద్దా అంటూ మస్క్ నిర్వహించిన పోల్‌లో మెజారిటీ సభ్యులు ‘అవును’ అని స్పందించిన విషయం తెలిసిందే. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే మస్క్‌పోల్‌ను కేవలం ట్విటర్ బ్లూ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
వాస్తవానికి ఈ ఆలోచన మస్క్‌ది కాదు. ‘Unfiltered Boss’ పేరిట ఉన్న ఓ బ్లూ సబ్‌స్క్రైబర్ ఈ మార్పును సూచించారు. విధానపరమైన నిర్ణయాల్లో కేవలం సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అవకాశం ఉండాలని ట్వీట్ చేశారు. దీనికి మస్క్ స్పందిస్తూ.. ‘ఆ మార్పును ట్విటర్ అమల్లోకి తీసుకొస్తుంది’ అని హామీ ఇచ్చేశారు. ఇకపై ట్విటర్ లో జరిగే కీలక నిర్ణయాలపై పోల్ నిర్వహించి తీసుకుంటామని చెప్పిన 24 గంటల వ్యవధిలోనే మస్క్ ఈ మార్పును తీసుకురావడం గమనార్హం.