ఫోర్ట్‌నైట్ గేమ్ యాప్ వివాదం.. గూగుల్‌, యాపిల్‌పై ఎపిక్ గేమ్స్ దావా..?

-

సాఫ్ట్‌వేర్ సంస్థలు గూగుల్, యాపిల్‌లు షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నాయి. ప్ర‌ముఖ గేమ్ యాప్ ఫోర్ట్‌నైట్‌ను త‌మ యాప్ స్టోర్స్ నుంచి తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. యాపిల్ సంస్థ ఇప్ప‌టికే ఆ గేమ్ యాప్‌ను యాప్ స్టోర్ నుంచి తొల‌గించ‌గా.. తాజాగా గూగుల్ త‌న ప్లేస్టోర్ నుంచి కూడా ఆ యాప్‌ను తీసేసింది. అయితే దీనిపై ఫోర్ట్‌నైట్ డెవ‌ల‌ప‌ర్లు మండిప‌డుతున్నారు.

మొబైల్ గేమింగ్ రంగంలో ప‌బ్‌జి మొబైల్ గేమ్‌కు ఎంత ఆద‌ర‌ణ ఉందో.. ఫోర్ట్‌నైట్ గేమ్‌కు కూడా అంతే ఆద‌ర‌ణ ఉంది. అయితే గేమ్‌లో భాగంగా ప్లేయ‌ర్లు కొనుగోలు చేసే ఐట‌మ్స్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు యాప్ ఉన్న స్టోర్ ను బ‌ట్టి చెల్లింపులు జ‌రిగేవి. అంటే.. ఆండ్రాయిడ్ యూజ‌ర్లు ఆ గేమ్ యాప్‌లో ఐట‌మ్స్ ను కొంటే ప్లేస్టోర్ ద్వారా చెల్లింపులు జ‌రుగుతాయి. అదే ఐఓఎస్ అయితే యాపిల్ యాప్ స్టోర్ ద్వారా చెల్లింపులు జ‌రుగుతాయి. ఈ క్ర‌మంలో ఆయా యాప్ స్టోర్‌ల‌కు గేమ్ యాప్ డెవ‌ల‌ప‌ర్లు కొంత వ‌ర‌కు క‌మిష‌న్ చెల్లిస్తారు. అయితే యాప్ స్టోర్‌ల అవ‌స‌రం లేకుండా నేరుగా త‌మ‌కే పేమెంట్ చేసేలా గేమ్ డెవ‌ల‌ప‌ర్లు తాజాగా అప్‌డేట్ ఇచ్చారు. దీంతో గూగుల్‌, యాపిల్ సంస్థ‌ల‌కు ఈ నిర్ణ‌యం న‌చ్చ‌లేదు. అందువ‌ల్ల వెంట‌నే ఆ యాప్‌ను త‌మ త‌మ యాప్ స్టోర్‌ల నుంచి తొల‌గించాయి.

కాగా ఈ విష‌యంపై గూగుల్‌, యాపిల్ సంస్థ‌లు స్పందిస్తూ.. ఫోర్ట్‌నైట్ యాప్ డెవ‌ల‌ప‌ర్లు త‌మ యాప్ స్టోర్‌ల‌కు సంబంధించిన పాల‌సీల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించార‌ని.. అందుక‌నే ఆ గేమ్ యాప్ ను తొల‌గించామ‌ని తెలిపాయి. వారు మ‌ళ్లీ త‌మ‌ను సంప్ర‌దించి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుంటే గేమ్ యాప్‌ను తిరిగి యాప్ స్టోర్‌ల‌లోకి అనుమ‌తిస్తామ‌ని తెలిపాయి. మ‌రోవైపు ఫోర్ట్‌నైట్ గేమ్ యాప్‌కు సంబంధించి ఎపిక్ గేమ్స్ సంస్థ గూగుల్‌, యాపిల్‌ల‌పై దావా వేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ రెండు సంస్థ‌ల‌తోపాటు ఫేస్‌బుక్‌, అమెజాన్ సంస్థ‌ల‌కు చెందిన సీఈవోలు అమెరిక‌న్ కాంగ్రెస్ స‌భ్యుల ఎదుట హాజ‌రై ఇదే త‌ర‌హా విష‌యాల‌పై వివ‌ర‌ణ ఇచ్చారు. తాము డెవ‌ల‌ప‌ర్ల‌కు మ‌ద్ద‌తుగా ఉంటామ‌ని, వారి ఐడియాల‌ను కాపీ కొట్ట‌డం లేద‌ని, త‌మ త‌మ యాప్ స్టోర్‌ల‌లో భారీ మొత్తంలో డెవ‌ల‌ప‌ర్ల నుంచి క‌మిష‌న్‌ను వ‌సూలు చేయ‌డం లేద‌ని తెలిపారు. ఇంత‌లోనే ఈ సంఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం విశేషం. మ‌రి ఎపిక్ గేమ్స్ ఈ విష‌యంలో రాజీ ప‌డుతుందా.. లేదా న్యాయ‌పోరాటానికి దిగుతుందా.. చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version