రాజకీయాల్లో గెలుపు గుర్రం ఎక్కాలంటే.. కేవలం ఏ ఒక్క కులమో.. వర్గమో.. సపోర్టు చేస్తే సరిపోతుందా? అంటే కానేకాదనేది గత ఏడాది ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును బట్టి స్పష్టంగా తెలుస్తోంది. ప్రశ్నిస్తానంటూ.. పార్టీ పెట్టి.. కాపుల ఓటు బ్యాంకుపై ఆశలు పెట్టుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్.. అన్ని వర్గాలను కూడగట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో ఆయనే ఎక్కడా గెలుపుగుర్రం ఎక్కలేక పోయారు. మరి అధికారంలో ఉన్న జగన్ పరిస్థితి ఏంటి? ఆయన కూడా అన్ని వర్గాలు కలిసి వచ్చాయి కాబట్టే.. గెలుపు గుర్రం ఎక్కి అధికారంలోకి వచ్చారనేది వాస్తవం.
కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు కమ్మ సామాజిక వర్గానికి ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఎంత లేదన్నా.. రాష్ట్ర వ్యాప్తంగా కమ్మల ఓటు బ్యాంకు కూడా ప్రతి పార్టీకీ అవసరమే. కేవలం టీడీపీకి మాత్రమే వారు ఓటేస్తారని అనుకుంటే.. జగన్‌కు అధికారం దక్కేదా? లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే.. అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన అవసరం మాత్రం జగన్‌కు ఉంది. పైగా అమరావతి రాజధానిని పక్కన పెడితే.. జగన్‌కు కమ్మల నుంచి ఎఫెక్ట్ వస్తుందనేది వాస్తవం. ఈ క్రమంలో కమ్మలకు పార్టీలో ప్రాధాన్యం పెంచాలనే డిమాండ్లు అంతర్గతంగా వినిపిస్తున్నాయి.
దీంతో జగన్ కూడా ఈ దిశగా అడుగులు వేశారు. చిలకలూరిపేట టికెట్‌ను త్యాగం చేసిన మర్రి రాజశేఖర్‌కు మంత్రి పదవి ఇస్తానని ఇవ్వలేదు. దీనిపై కమ్మ వర్గాల్లో ఆగ్రహం ఉంది. అయితే. ఇప్పుడు రాజధానిని తరలించడంతో ఇది మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మర్రికి ఛాన్స్ ఇస్తే.. వీరు సైలెంట్ అవుతారని జగన్ భావించారు. ఈ నేపథ్యంలో ఇటీవల మోపిదేవి వెంకటరమణ ఖాళీ చేసిన ఎమ్మెల్సీ టికెట్‌ను మర్రికి ఇవ్వాలని భావించారు. దీనికి సంబంధించి రంగం కూడా రెడీ చేసుకున్నారు.
మర్రికి కూడా కబురు పెట్టారు. కానీ, ఇంతలోనే విజయనగరం జిల్లాకు చెందిన పెన్మత్స సాంబశివరాజు మృతి చెందడంతో ఆ కుటుంబానికి ఈ టికెట్‌ను కన్ఫర్మ్ చేసేశారుజగన్. ఇది మరింతగా అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ఈ పరిణామం.. మర్రిని అవమానించినట్టుగా లేదని, కమ్మలను తొక్కేసినట్టుగా ఉందని అంటున్నారు. ఈ పరిణామాలతో కమ్మ వర్గం పూర్తిగా జగన్‌కు దూరమవుతోందనే వాదన బలంగా వినిపిస్తోంది.