బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఫైర్ అయ్యారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఆయణ్ను హెచ్చరించారు. బీజేపీ నేతలు డబ్బుతో మునుగోడు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. మునుగోడు ప్రజలు చైతన్యవంతులని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆలోచించి ఓట్లు వేయాలని సూచించారు.
చండూరులో ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రచారం నిర్వహించారు. మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీకి ఓట్లడిగే హక్కు లేదని మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్‌ను చూస్తే బీజేపీ నేతల వెన్నులో వణుకుపుడుతోందని అన్నారు. కేసీఆర్‌ను నిలువరించే శక్తి ఎవ్వరికీ లేదని చెప్పారు.
మునుగోడులో సీఎం కేసీఆర్ ఫ్లోరైడ్‌ను రూపుమాపారని.. అభివృద్ధి చేశాం కాబట్టే తాము ప్రజలను ఓట్లు అడగగలుగుతున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఉపఎన్నికల్లో గెలిచిన నాగార్జునసాగర్, హుజూర్‌నగర్‌లో ఊహకందని విధంగా అభివృద్ధి చేశామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి ప్రజలను బీజేపీ మోసం చేసిందని ఆరోపించారు. చౌటుప్పల్‌లో ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్న జేపీ నడ్డా హామీ ఏమైందని మంత్రి ఎర్రబెల్లి నిలదీశారు.