Ori devuda Review: విశ్వక్‌ సేన్‌ ‘ఓరి దేవుడా!’ ఎలా ఉందంటే..?

-

విశ్వక్‌సేన్ క‌థానాయ‌కుడిగా వెంక‌టేష్ అతిథి పాత్రలో న‌టించిన ‘ఓరి దేవుడా’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమా ప‌తాకంపై తెర‌కెక్కడం, ప్రచార చిత్రాలు ఆస‌క్తిని రేకెత్తించ‌డంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన ఓ మై కడవులే చిత్రానికి ఇది రీమేక్. తెలుగులోనూ అదే మేజిక్‌ని పున‌రావృతం చేసిందో లేదో తెలుసుకుందాం.

క‌థేంటంటే: అర్జున్ (విశ్వక్‌ సేన్‌), అను (మిథిలా పాల్కర్) చిన్నప్పటి నుంచి స్నేహితులు. అను ఇష్టపడటంతో అర్జున్ ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కానీ, ఆ తరవాతే సమస్యలు మొదలవుతాయి. అర్జున్‌ని అను అనుమానిస్తూనే ఉంటుంది. అర్జునేమో ఆమె ప్రేమను అర్థం చేసుకోకుండా తన స్వేచ్ఛ కోల్పోయినట్లు భావిస్తాడు. దాంతో ఇద్దరూ విడాకులకు సిద్ధం అవుతారు. జీవితంలో భార్య స్నేహితురాలిగా ఉండొచ్చు కానీ, స్నేహితురాలే భార్యగా రాకూడదంటూ అర్జున్‌ దేవుడు ముందు మొర పెట్టుకుంటాడు. ప్రేమ పెళ్లి విషయంలో తనకి సెకండ్ ఛాన్స్ ఇవ్వమని కోరుకుంటాడు. దేవుడు కొన్ని కండిషన్స్‌తో అందుకు అంగీకరిస్తాడు. మరి, సెకండ్ ఛాన్స్ తీసుకున్న అర్జున్ తనకి స్కూల్ డేస్ నుంచి ఇష్టమైన మీరా (ఆశా భట్) ప్రేమని పొందాడా? అను-అర్జున్‌ విడిపోయారా? ఇంతకీ ఈ కథలో దేవుడు (వెంకటేష్) కథ ఏమిటి? ఆయన ఎలా వచ్చాడనేది మిగతా కథ.

ఎలా ఉందంటే: సున్నిత‌మైన అంశాలున్న ఫాంట‌సీ క‌థ ఇది. ప్రేమ‌తోపాటు, రొమాంటిక్ కామెడీ నేప‌థ్యంలో సాగుతుంది. జీవితాల్లో రెండో అవ‌కాశం గురించి, మ‌న‌కు ఎదుర‌య్యే క‌ష్టాల్ని మ‌నం ఎలా చూస్తున్నామ‌నే విష‌యాల గురించి చ‌ర్చించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. ఇలాంటి సున్నిత‌మైన క‌థ‌ల్ని రీమేక్ చేయ‌డం సాహ‌స‌మే. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన ఈ సినిమాని అక్కడి ద‌ర్శ‌కుడే అంతే ప‌క్కాగా తెర‌పైకి తీసుకొచ్చారు. దాంతో భావోద్వేగాలు బాగా పండాయి. ప్ర‌థ‌మార్ధం అంతా కూడా స్నేహం, పెళ్లి త‌ర్వాత జీవితాన్ని ఆవిష్క‌రిస్తూ స‌ర‌దా స‌ర‌దాగా సాగుతుంది. స్నేహితులు భార్యాభ‌ర్త‌లైతే ఎలా ఉంటుంది? ఇష్టం లేని ప‌ని చేస్తున్న‌ప్పుడు ఆలోచ‌న‌లు ఎలా ఉంటాయ‌నే విష‌యాల్ని చాలా బాగా ఆవిష్క‌రించారు. నీకు చెప్పినా అర్థం కాదంటూ విష్వ‌క్‌సేన్‌, అర్థం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించే స్నేహితుడు మ‌ణి పాత్ర‌లో కనిపించిన వెంక‌టేష్ కాకుమాను క‌లిసి న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు.

https://youtu.be/abgPbcJ3VeE

విరామ స‌న్నివేశాలు సినిమాకి హైలైట్‌. ద్వితీయార్ధంలో భావోద్వేగాల‌పై దృష్టిపెట్టారు. రెండో అవ‌కాశం వ‌చ్చాక క‌థానాయ‌కుడు అనుతో క‌లిసి చేసిన ప్ర‌యాణం ఎలాంటిది? మీరాతో ప్రేమాయ‌ణం? ఆ నేప‌థ్యంలో మ‌లుపులు ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. మీరా బ‌ర్త్ డే వీడియో నేప‌థ్యంలో స‌న్నివేశాలు, ప‌తాక స‌న్నివేశాల్లో అను – అర్జున్ మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ మ‌నసుల్ని హ‌త్తుకుంటుంది. దేవుడు పాత్ర సినిమాకి కీల‌కం. మోడ్ర‌న్ దేవుడిగా వెంక‌టేష్ క‌నిపించిన తీరు చాలా బాగుంది. ఆయ‌న ఎంట్రీ ఎలా జ‌రిగింది? ఎందుకొచ్చాడ‌నే విష‌యాల జోలికి వెళ్ల‌కుండానే ఈ సినిమాని ఆయ‌న చుట్టూ న‌డిపిన తీరు ద‌ర్శ‌కుడి ప‌రిణ‌తికి అద్దం ప‌డుతుంది. ఆ పాత్ర‌లో వెంక‌టేష్ అంతే బాగా ఒదిగిపోయారు. ఆయ‌న ప‌క్క‌న స‌హ‌దేవుడిగా క‌నిపిస్తూ రాహుల్‌ రామ‌కృష్ణ అక్క‌డ‌క్క‌డా న‌వ్వించారు. ఇంటిల్లిపాదీ క‌లిసి చూసేలా సినిమా ఉండ‌టం, పండ‌గ సంద‌ర్భంగా విడుద‌ల కావ‌డం క‌లిసొచ్చే విషయాలు.

https://youtu.be/UCF6QXrg00c

ఎవ‌రెలా చేశారంటే: ఒక క‌థ‌కి అనుకున్న‌ట్టుగా న‌టులు కుదిరితే ఎలా ఉంటుందో ఈ సినిమా చాటి చెబుతుంది. పాత్ర‌ల్ని ఎంత బాగా డిజైన్ చేశారో, అంతే ప‌క్కాగా న‌టుల్ని ఎంపిక చేసుకున్నాడు ద‌ర్శ‌కుడు. విష్వ‌క్‌సేన్‌, మిథిలా పాల్క‌ర్, ఆశాభ‌ట్ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. ప్ర‌థ‌మార్ధంలో విష్వ‌క్ త‌న పాత్ర‌లో చూపించిన ఎన‌ర్జీ బాగుంది. ద్వితీయార్ధంలో క‌థానాయిక‌లు పండించిన భావోద్వేగాలు హైలైట్‌. ఈ విషయంలో మిథిలా పాల్కర్‌కు ఎక్కువ మార్కులు పడతాయి. వెంక‌టేష్ న‌ట‌న, ఆయ‌న క‌నిపించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. వెంక‌టేష్ కాకుమాను, రాహుల్ రామ‌కృష్ణ‌, ముర‌ళీశ‌ర్మ‌, నాగినీడు త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. కెమెరా, సంగీతం చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లం. నిర్మాణ హంగులు బాగున్నాయి. ద‌ర్శ‌కుడు సినిమాని అప్‌గ్రేడ్ చేసి తీశారు కానీ, ప్ర‌థ‌మార్ధంలో హీరో, ఫ్రెండ్ పాత్ర‌ల మ‌ధ్య హాస్యం చాలలేద‌నిపిస్తుంది. త‌రుణ్ భాస్క‌ర్ మాట‌లు బాగున్నాయి.

చివ‌రిగా: ఓరి దేవుడా… ఇంటిల్లిపాదీ క‌లిసి చూసే సినిమా.

https://youtu.be/x4-7tqS1h_Q

Read more RELATED
Recommended to you

Exit mobile version