లగచర్ల ఘటనలో.. 55 మంది అరెస్ట్ అయ్యారట. ఇక దీనిపై ఈటల రాజేందర్ స్పందించారు. లగచర్ల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అక్రమ కేసులు పెడితే మంచిది కాదని హెచ్చరిస్తున్నామని తేల్చి చెప్పారు. వారి మీద కేసులు పెడితే యావత్ తెలంగాణ సమాజం తిరుగుబాటు చేస్తుందని హెచ్చరిస్తున్నామన్నారు ఈటల. ఫార్మా కంపెనీలకు అవసరమైతే వారే భూసేకరణ చేసుకుంటారు కానీ ప్రభుత్వం మధ్యలో బ్రోకర్ లాగా వ్యవహరించాల్సిన అవసరం లేదని తెలిపారు.
నీకు ఓట్లు వేసింది బ్రోకర్ గిరి చేయడానికి, మధ్యవర్తిత్వం చేయడానికి కాదన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల గ్రామంలో ఫార్మాసిటీ కోసం భూములు సేకరించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. దీనిని అక్కడ రైతాంగం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. మా భూములు గుంజుకోకండి, మా ఉపాధి మీద దెబ్బకొట్టకండి అని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినకుండా ఫార్మా కంపెనీలకు రైతుల భూములను అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు ఈటల రాజేందర్.