నియోజకవర్గాలు మారినా ఆ మాజీ మంత్రి తలరాత మారలేదా ?

-

ఆయన టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒకసారి గెలిచారు. గెలిచిన తొలిసారే మంత్రయ్యారు. మంత్రిగా గెలిచినా నియోజకవర్గ ప్రజలకు, పార్టీ క్యాడర్ కు దగ్గర కాలేకపోయారు. రెండోసారి కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఇక్కడ కూడా అదే పద్ధతిలో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారట. నియోజకవర్గాలు మారినా ఆ మాజీ మంత్రి తలరాత మాత్రం మారడం లేదట..

టీడీపీ నేత మాజీ మంత్రి జవహర్ ఏ నియోజకవర్గంలో కుదురుకోకపోవటం టీడీపీ అధిష్టానానికి కొత్తచిక్కులు తెస్తోందట. 2014 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన జవహర్ పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి గెలిచారు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో బీర్ హెల్త్ డ్రింకేనని మంత్రిగా జవహర్ చేసిన కామెంట్లు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. మంత్రిగా పనిచేసినా కొవ్వూరు నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ కు మంత్రి దగ్గర కాలేకపోయారు. పైగా నియోజకవర్గంలో వర్గ పోరు పెరిగింది. అదే సమయంలో స్థానికంగా మంత్రి చేసిన అభివృద్ధి పనులు కూడా ఏమీలేవనే విమర్శలు కూడా ఉన్నాయి. స్థానిక పార్టీ శ్రేణులకు జవహర్ కు మధ్య ఉన్న గ్యాప్ చివరికి ఆయన్ని నియోజకవర్గంలో రెండోసారి పోటీచేయకుండా చేసింది. దీంతో ఆయన తట్టా బుట్టా సర్దేశారు.

2019 ఎన్నికల్లో జవహర్ ని కృష్ణాజిల్లా తిరువూరు నుంచి పోటీకి దింపింది టీడీపీ అధిష్టానం. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లగట్ల స్వామిదాసును పక్కన పెట్టి మరీ జవహర్ కు టీడీపీ అవకాశం ఇచ్చింది. జవహర్ స్వస్థలం తిరువూరు కావటం, అక్కడ ఇంకా కొందరు కుటుంబ సభ్యులు ఉండటంతోపాటు వరుసగా ఓటమి పాలవుతున్న స్వామిదాసును మార్చాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంది టీడీపీ. అయితే ఇక్కడ నుంచి జవహర్ ఓటమి పాలయ్యారు. జవహర్ రాకను నల్లగట్ల స్వామిదాసు వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. అయినప్పటికీ కూడా సర్దుబాటు చేసిన టీడీపీ అధిష్టానం జవహర్ ను పోటీకి దింపినా విజయం మాత్రం వరించలేదు. అయితే ఓటమి పాలైన తర్వాత కూడా జవహర్‌ తీరు ఏం మారలేదట.

ఎన్నికల సమయంలో తిరువూరులో తిరిగిన జవహర్‌, ఓటమి పాలైన తర్వాత సైలెంట్‌ అయ్యారట. నియోజకవర్గంలో కనీసం పర్యటనలు చేయకుండా మొక్కుబడిగా చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారట జవహర్. దీంతో మళ్ళీ గతంలో పనిచేసిన నల్లగట్ల స్వామిదాసే నియోజకవర్గ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. జవహర్ మాత్రం నియోజకవర్గంలో క్యాడర్ ను దూరం పెట్టి తిరిగి కొత్త నియోజకవర్గంలో వెతుక్కునే పనిలో పడ్డారట. ఇటీవలే టీడీపీ రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ బాద్యతలు అప్పగించటంతో ఆయన తిరువూరుకు ముఖం చాటేశారనే టాక్ మొదలైంది. మళ్లీ తన పాత నియోజకవర్గానికి వెళ్తారని అందుకే ఇటు రావటంలేదని తిరువూరు టీడీపీ శ్రేణులు అప్పుడే గుసగుసలాడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version