సైలెంట్ గా పొలిటికల్ ఫ్యూచర్ చక్కబెట్టుకుంటున్న మాజీ మాంత్రి

-

ఆయనో మాజీ మంత్రి. టీడీపీని వీడి వైసీపీలో చేరారు. కొన్నాళ్లు సైలెంట్‌గానే ఉన్నా రాష్ట్రస్థాయి పదవి పట్టేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు మొదలు పెట్టారట.సొంత నియోజకవర్గంతో పాటు జిల్లా విభేదాల్లో ఎక్కడా వేలు పెట్టకుండా రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవి పై గట్టి స్కెచ్ వేశారట..ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు పొలిటికల్‌ ఫ్యూచర్‌పై ఇప్పుడు వైసీపీ-టీడీపీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

టీడీపీ హయాంలో మంత్రిగా ఉంటూ హడావిడి చేసిన శిద్దా రాఘవరావు ఏడాదిన్నరగా చడీచప్పుడు లేకుండా సైలెంటయ్యారు. గ్రానైట్ వ్యాపారం చేసే శిద్దా గతంలో టీడీపీకి నమ్మిన బంటుగా ఉన్నాడు. ఒక సారి ఎమ్మెల్సీగా పని చేసిన శిద్దా రాఘవరావు…2014లో దర్శి నుండి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపొందిన శిద్దా రాఘవరావుని గత ప్రభుత్వంలో మంత్రి పదవి వరించింది. జిల్లాలో శిద్దా ఒక్కరే మంత్రి కావడంతో ఆయనకి తిరుగు లేకుండా పోయింది.ఇక టీడీపీ పార్టీలోనూ ముఖ్య పదవులు శిద్దా అనుభవించారు.2019ఎన్నికల్లో అప్పటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీడీపీ నుండి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

ఎన్నికల్లో ఓటమి చెందిన శిద్దా రాఘవరావుని అధికార వైసీపీ ఏడాది క్రితం టార్గెట్ చేసింది. శిద్దా రాఘవరావుకి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న గ్రానైట్ పై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. శిద్దా రాఘవరావుతో పాటూ ఆయన కుటుంబ సభ్యుల గ్రానైట్ క్వారీల్లో కూడా తనిఖీలు చేశారు. గ్రానైట్ తవ్వకాల్లో అక్రమాలు జరిగాయంటూ అందరికీ కలిపి 900 కోట్లు జరిమానా విధించారు. వందల కోట్ల జరిమానాలు చూసి శిద్దా అండ్ ఫ్యామిలీ షాక్ అయ్యారు. జరిమానాల నుండి తప్పించుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. అధికార పార్టీ నుండి వత్తిడులు ఎదుర్కొంటున్న శిద్దా అన్న కుమారులు శిద్దా హనుమంతరావు, సూర్య ప్రకాష్ రావులు జిల్లా మంత్రి బాలినేని సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. ఆతరువాత శిద్దా రాఘవరావు ఆయన కొడుకు సుధీర్ తో కలిసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.

అయితే గతంలో టీడీపీలో ఏదో ఒక పదవి పేరు ముందు పెట్టుకుని తిరిగిన శిద్దా రాఘవరావు ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదట. గత ఎన్నికల సమయంలో ఒంగోలు పార్లమెంట్ నుండి పోటీ చేసి శిద్దా ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం పార్లమెంట్ వైసీపీ ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి ఉన్నారు. అనుచరులు ఎక్కువగా ఉన్న దర్శి నియోజక వర్గంలో వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఉన్నారు. దర్శిలో ఇప్పటికే ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దీంతో బయట ఎక్కడికీ శిద్దా రాఘవరావు కాలుపెట్టే పరిస్థితి లేకుండా పోయిందట. అయితే అధికార పార్టీలో ఉన్న శిద్దా రాఘవరావు పైకి సైలెంట్ గా ఉన్నా…పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యేందుకు దారులు వెతుకుతున్నారట.

జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో నిత్యం టచ్ లో ఉంటూ..వైసీపీలో కీరోల్ పోషించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం కాలు పెట్టేందుకు అధికార పార్టీలో నియోజక వర్గాలు ఖాళీ లేవు కాబట్టి…ఏదైనా నామినేటెడ్ పదవి ఇవ్వాలని శిద్దా రాఘవరావు అడుగుతున్నారట. ప్రస్తుతం ఫ్యామిలీ మొత్తం వైసీపీలో ఉన్నాం కాబట్టి…అధికార పార్టీలో గుర్తింపు ఇవ్వాలని శిద్దా అడుగుతున్నారట. దీనిపై వైసీపీ అధిష్టానం కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version