గత కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 513.64 మీటర్లకు చేరింది.ఫలితంగా జీహెచ్ఎంసీ లేక్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. రెండు అలుగులు, ఒక తూము ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు.
వచ్చిన నీటిని వచ్చినట్టే వదులుతున్నప్పటికీ.. నీటి మట్టం పెరుగుతుండటం వల్ల స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హుస్సేన్‌సాగర్ క్యాచ్‌మెంట్ ఏరియా 240 చదరపు కిలో మీటర్లు ఉండగా.. ఈ ప్రాంతం మొత్తాన్ని వర్షం ముంచెత్తుతోంది.మరోవైపు నగరంలో వర్షం తగ్గుముఖం పట్టిందని… సాగర్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. రెండు రోజుల్లో సాధారణ స్థితికి చేరుతుందని బల్దియా అధికారులు భరోసా ఇచ్చారు.