అతిపెద్ద సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అయిన ఫేస్ బుక్, తన పాలసీ విధానంలో మార్పు తీసుకువచ్చింది. కరోనా వైరస్ ల్యాబ్ లోనే పుట్టిందన్న దాని గురించిన విశేషాలను ఫేస్ బుక్ లో పంచుకోరాదని, ఆ కంటెంట్ మీద నిషేధం విధించింది. కానీ ప్రస్తుతం ఆ నిషేధాన్ని ఫేస్ బుక్ ఎత్తివేసింది. కరోనా ఎక్కడ పుట్టిందన్న విషయమై పరిశోధనలు, విచారణ జరగాలని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫేస్ బుక్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మేరకు ఫేస్ బుక్ ప్రతినిధి మాట్లాడుతూ ఆరోగ్య నిపుణులు చెప్పే ప్రతీ విషయాలు ఫేస్ బుక్ లో ఉంటాయని, కాలానికనుగుణంగా ఫేస్ బుక్ లో మార్పులు జరుగుతుంటాయని అన్నారు.
గత ఏడాది డిసెంబరులో కరోనా గురించి అసత్య ప్రచారం పంచుకోవడం, వ్యాక్సిన్ విషయాల్లో వార్తలు మొదలగునవి ఫేస్ బుక్ పై పంచుకోకూడదని నిషేధం విధించింది. తాజాగా అమెరికాలోని వాషింగ్టన్ లో, కరోనా వైరస్ ల్యాబ్ లోనే పుట్టిందన్న విషయమై వార్తలు వెలువడ్డాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ విషయమై విచారణ జరపాలని ఇంటెలిజెన్స్ వర్గాలకు సూచించారు. 90రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసారు కూడా. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ గురించిన అనుమానాలు ఇంకా అలానే ఉన్నాయి.
అదీగాక అమెరికా ఫుడ్ అండ్ మాజీ అధిపతి మాట్లాడిన దాని ప్రకారం చైనాలోని వుహాన్ ల్యాబ్ నుండే కరోనా పుట్టిందన్న అనుమానాలు రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయని, ప్రస్తుతానికి ఇది నిరాధారం అయినప్పటికీ ఇంకొన్ని రోజుల్లో తేలుతుందని అన్నారు. ఇంకా అమెరికా మాజీ కాద్యదర్శి మైక్ పాంపో చెప్పిన దాని ప్రకారం వుహాన్ ల్యాబ్ లో కరోనా పుట్టిందా? లేదా జంతువుల నుండి మనుషులకి వచ్చిందా అనే దానికి చైనా కమ్యూనిస్ట్ పార్టీ జవాబుదారీగా ఉండాలని అన్నారు.