కరోనా మహమ్మారికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో సైంటిస్టులు వ్యాక్సిన్‌ను తయారు చేసే పనిలో ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సైంటిస్టులు జంతువులపై ప్రయోగాలు చేసి కొన్ని చోట్ల సక్సెస్ అయి హ్యూమన్ ట్రయల్స్‌కు సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఏ దేశానికి చెందిన సైంటిస్టులు కూడా కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేయలేదు. కానీ ఇజ్రాయెల్ సైంటిస్టులు కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేశారంటూ.. తాజాగా పలు వార్తలు వచ్చాయి. అయితే మరి ఆ వార్తలు నిజమేనా..? నిజంగానే ఇజ్రాయెల్ సైంటిస్టులు కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేశారా..? అంటే.. అందుకు కాదనే సమాధానం వస్తోంది. ఆ వార్తలన్నీ అబద్దాలేనని, వాటిలో ఎంత మాత్రం నిజం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలియజేసింది.
ఇజ్రాయెల్ సైంటిస్టులు పౌల్ట్రీ రంగానికి చెందిన కరోనా వైరస్ తరహా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేసి దాన్ని కరోనా ట్రీట్‌మెంట్ కోసం వాడదగిన వ్యాక్సిన్‌గా మార్చే పనిలో ఉన్నారు. ఆ మేరకు వారి ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. ఇక హ్యూమన్ ట్రయల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. అదీ.. అసలు విషయం.. కానీ ఇజ్రాయెల్ సైంటిస్టులు నిజంగానే కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేశారని వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ ఫేక్ వార్తలేనని తేలింది. నిజానికి ఇప్పటి వరకు ఏ దేశానికి చెందిన సైంటిస్టులు కూడా కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేయలేదని, వారి ప్రయోగాలన్నీ ట్రయల్స్ దశలోనే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
అయితే ఈ ఏడాది చివర్లోగా కరోనాకు వ్యాక్సిన్ వచ్చేందుకు అవకాశం ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. అదే జరిగితే వచ్చే ఏడాది మధ్య వరకు పెద్ద ఎత్తున కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని.. వారు ఆశాభావం వ్యక్తం చేశారు.