ఇప్పుడు తెలంగాణలో బీజేపీ మంచి జోష్ మీద దూసుకుపోతోంది. ఇక దీనికి కలిసొచ్చే విధంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక రావడం ఒక పెద్ద ఎత్తు. ఇప్పటికే ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి మరింత బలం పెంచుకోవాలని బీజేపీ బాగానే ప్రయత్నిస్తోంది. టీఆర్ ఎస్ వర్సెస్ బీజేపీ అన్న మాదిరిగా ప్రచార హోరు ఇక్కడ సాగుతోంది. ఈటల రాజేందర్ బీజేపీ నుంచి పోటీ చేయడం ఆ పార్టీకి బాగా కలిసివచ్చే అంశం. కాగా ఈటలకు ఉప ఎన్నిక విషయంలో మొదట్లో కాస్త సపోర్టుగానే ఉన్న కమలం నేతలు మళ్లీ దూరం అవుతున్నట్టు తెలుస్తోంది.
ఇక ఈటల రాజేందర్ కూడా ఒంటరిగానే రాజకీయాల్లో ముందుకు సాగేందుకు రెడీ అవుతున్నారంట. టీఆర్ఎస్‌లో ఈటల ఉన్నప్పుడు అందరితో కలుపుగోలుగా ఉండే నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అక్కడ ఉన్నన్ని రోజులు ఎవరితోనూ వైరం పెట్టుకోలేదు. కాగా బీజేపీలో చేరిన తర్వాత వారి మైండ్‌సెట్‌తో ఈటల సర్దుకుపోలేక పోతున్నారు. అందుకే బీజేపీ నేతలు రాష్ట్రంలో చేపడుతున్న ఏ పనులపై కూడా ఆయన పెద్దగా కామెంట్లు చేయట్లేదు.
ఇక నరేంద్ర మోడీ బొమ్మను ప్రచారంలో వాడకపోవడం, తనను చూసి ఓటేయాలని కోరడం, కాషాయ రంగును ఎక్కడా కనిపించకుండా చేయడం లాంటివి ఈటలకు మైనస్‌గా మారాయి. ఇక బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రపై కూడా ఎలాంటి కామెంట్లు చేయకపోవడం చాలా మైనస్‌గా మారింది. ఈ కారణాలతోనే టీ బీజేపీ నేతలు కూడా ఆయన్ను పకకన పెడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఈటల రాజేందర్ చేపట్టే సభల్లో కూడా పెద్దగా పాల్గొనకుండా దూరంగానే ఉంటున్నట్టు తెలుస్తోంది.