కర్నూలులో బాంబుల సంస్కృతి మళ్లీ మొదలైందా ?

-

కర్నూలు జిల్లా అంటేనే ఒకప్పుడు ముందుగా గుర్తొచ్చేది హత్యలు, బాంబుల శబ్దం, ప్రతీకారంతో ప్రత్యర్థులను మట్టుబెట్టడం…ఇప్పుడా పరిస్థితి లేదు. ఆర్థికంగా బలపడిన ఫ్యాక్షన్ నేతలు ప్రశాంత జీవితం గడపాలనుకుంటున్నారు. ఫ్యాక్షన్ నేతల అడుగులకు మడుగులొత్తిన కింది స్థాయి కార్యకర్తలు కూడా కక్షలు, కార్పణ్యాలు వద్దనుకుంటున్నారు. అయితే తరచూ ఏదో ఒక మూల ఆధిపత్యం కోసం హత్యలు చేస్తున్నారు. వేట కొడవళ్ళతో గొంతులు కోస్తున్నారు. రెండు, మూడేళ్ళుగా మళ్లీ బాంబులు బయట పడడం, పేలుళ్లు ఆందోళన కలిగిస్తున్నాయి.

అవుకు మండలం చెన్నంపల్లిలో ఓ పెట్టెలో దాచిన నాటు బాంబులు పేలి బాలుడు చనిపోవడం కలకలం రేపింది. అవి ఎప్పుడో పొరపాటున పెట్టినవి కావు.. ప్రత్యర్ధులను చంపేందుకు స్కెచ్ వేసి పెట్టినవి. ఇదే ఏడాది సంజామల మండలం లో గోడలో దాచి ఉంచిన బాంబు పేలింది. మూడేళ్ళ క్రితం కర్నూలు శివార్లలో జోహారాపురం రోడ్ లో పొలంలో దాచిన బాంబులు పేలి ముగ్గురు ప్రాణాలు చనిపోయారు. అయితే అవి ఎవరు పెట్టారన్నది ఇప్పటికీ తేలలేదు.

ఇక చెన్నంపల్లి మాజీ ఎమ్మెల్యే బిజ్జమ్ పార్థసారథి రెడ్డి స్వగ్రామం. ఈ ఊళ్లో ఆయన ప్రత్యర్దులు కాటసాని సోదరులు ఉన్నారు. 2004 లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. 2019 ఎన్నికల ముందు బిజ్జమ్ పార్థసారథి రెడ్డి కూడా వైసీపీ లో చేరారు. తర్వాత ఎలాంటి గొడవలు లేవు. మరి ఈ బాంబులు ఎక్కడినుంచి వచ్చాయన్నది అంతు చిక్కడం లేదు. దీనిపై ఇప్పటికే కొందరిని ప్రశ్నిస్తున్నారు.

చెన్నంపల్లిలో ఇటీవలే తయారు చేసి సిద్ధంగా ఉంచిన బాంబులు ఎవరి కోసమనే విషయంపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. వీటితో పాటు మరికొన్ని బాంబులు కూడా దొరికినట్టు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఇన్వెస్టిగేషన్‌ కీలకంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version