సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు శనివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాకు ఎయిర్ పోర్టు మంజూరు అయినందుకు సీఎంకు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వరంగల్ ఎంపీ కావ్య, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాగరాజు, డీసీసీ అధ్యక్షుడు భరత్ సింహారెడ్డి, తదితరులు ఉన్నారు.
కాగా, రాష్ట్ర ప్రభుత్వం,సీఎం రేవంత్ విజ్ఞప్తి మేరకు మామూనూరు ఎయిర్ పోర్ట్ ఆపరేషన్స్‌కి కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.