మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తూ, నకిలీ డాక్టర్ అవతారమెత్తిన ఓ కంత్రీ గాడు యూట్యూబ్ వీడియోల సాయంతో అబార్షన్లు చేస్తూ అధికారులకు చిక్కాడు. వరంగల్ నగరం నడిబొడ్డున ఆసుపత్రి నిర్వహిస్తున్న ఈ మెడికల్ రిప్రజెంటేటివ్, ఎలాంటి అనుమతి, అర్హత లేకుండా అబార్షన్లు చేస్తున్నారని తెలియడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బుధవారం అర్ధరాత్రి దాడి చేసి పట్టుకున్నారు.
ఇంద్రారెడ్డి అనే కంత్రి గాడు నెల రోజుల కిందట హన్మకొండలోని ఏకశిలా పార్కు ఎదురుగా సిటీ హాస్పిటల్ పేరుతో ఆసుపత్రి మొదలుపెట్టాడు. రెండోసారి ఆడపిల్లలు వద్దనుకునే మహిళలు, ప్రేమ పేరిట జరిగే కడుపులు తీయించాలని చూస్తున్న వారిని ఆర్‌ఎంపీలు, పీఎంపీల ద్వారా గుర్తించి వారికి అబార్షన్లు చేస్తున్నారు. నర్సింగ్‌లో శిక్షణ పొందినవారితో కలిసి , యూట్యూబ్ చూస్తూ ఈ అబార్షన్లు చేయిస్తున్నట్టు గుర్తించారు. పట్టుకోవడానికి వచ్చిన అధికారులను చూసి వైద్య సిబ్బంది గోడదూకి పారిపోయారు.