సినిమా రంగంలో సామాన్యుడు..అసామాన్యుడిగా ఎదగడంలో కీలక పాత్ర పోషించేది ప్రేక్షకులే. ఆడియన్స్ లేనిదే సినిమాలేదు. హీరో లేడు. అభిమానించారంటే నెత్తిన పెట్టుకుంటారు. ప్రాణం ఇస్తారు. తొక్కారంటే అంతకంతకు పాతాళానికి అంతే వేగంగా వెళ్లాల్సి ఉంటుంది. అందుకే వేదికలపై మాట్లాడే ముందు చాలా మంది హీరోలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని మాట్లాడుతారు. మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి, నటసింహంగా కీర్తింపబడుతోన్న బాలయ్య, విక్టరీగా నీరాజనాలు అందుకుంటోన్న వెంకటేష్, కింగ్ గా శిఖరానికి చేరుకున్న నాగార్జున వేదికలపై ఎంతో హుందాగా నడుచుకుంటారు. ట్రెండ్ మారిందని తత్వాన్ని మార్చుకోలేదు.
అభిమానులంటే దైవ సమానం గా భావిస్తారు. అభిమానులు ఏదైనా చేయగలరని పరోక్షంగా చాలాసార్లు హింట్ ఇచ్చారు. తర్వాతి తరం నటులైన మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ లాంటి వాళ్లు వారసత్వం ఉందని హద్దులు దాటి మాట్లాడింది ఎక్కడా లేదు. తెలంగాణ నుంచి స్టార్ గా అవతరించిన నితిన్ కూడా ఎంతో హుందాగా నడుచుకుంటాడు. తండ్రి పెద్ద నిర్మాత అయినా నిరాడంబరంగా ఉంటాడు. అందుకే నితిన్ అంటే ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తారు. విజయ్ దేవరకొండ ఎంట్రీ కి ముందున్న ఏకైక స్టార్ కాబట్టి తెలంగాణ ప్రజలు ప్రత్యేకమైన అభిమానాన్ని చూపించారు. ఆ ప్రాంతీయ బేధాన్నే విజయ్ దేవరకొండపై పై కూడా అభిమానులు చూపించి పెద్ద స్టార్ ని చేసారు.
విజయ్ ఓవర్ నైట్ లో స్టార్ అవ్వడానికి ముఖ్య కారణం ఇక్కడి అభిమానులే. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే మాటను మాత్రం విజయ్ మర్చిపోయాడని కొంత మంది అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. అభిమానుల పట్ల అమార్యదగా మాట్లాడటం..అంటే ఆపండ్రా భయ్….ఏంది రా భయ్ వంటి వ్యాఖ్యలపై అసంతృప్తిని వ్యక్తం చేసారు. సందర్భాను సారం మాట్లాడితే పర్వాలేదు. కానీ అసందర్భంగా అత్యుత్సాహానికి పోయి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని మంటెక్కిపోతున్నారు. కామ్రేడ్ తగ్గించుకోకపోతే కట్ చేస్తామంటూ సంకేతాలిచ్చారు. మంచి పెర్పామర్ అయినప్పటికీ అతి తగ్గించకపో భవిష్యత్ కే ముప్పని హెచ్చరిస్తున్నారు. డియర్ కామ్రెడ్ ప్రచార కార్యక్రమంలో భాగంగా చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు తెలంగాణ అభిమానుల కోపానికి కారణమయ్యాయని తెలుస్తోంది.