దేశంలో మహిళలపై లైంగికదాడులకు అడ్డుకట్టపడడం లేదు. నిత్యం ఏదో ఒకచోట వారిపై అగయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా ఫలితంలేకుండా పోతోంది. మానవమృగాల్లో మార్పు రావడం లేదు. ఇటీవల తెలంగాణలో తనపై 139మంది లైంగికదాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. మహారాష్ట్రలోనూ మరో దారుణం జరిగింది. జల్నా జిల్లాలో పొలంలో పనికి వెళ్లిన మహిళపై కౌలు రైతుతోపాటు అతడి డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. జల్నా తాహసిల్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లలతో ఉంటోంది.
అయితే.. గ్రామంలోనే వ్యవసాయ కూలీ పనులు చేస్తూ తన పిల్లలను పోషిస్తోంది. గురువారం స్థానికంగా ఓ కౌలు రైతు పొలంలో పనికి వెళ్లింది. అయితే..కౌలు రైతు, అతడి డ్రైవర్ ఆమెను తీవ్రంగా కొట్టి తాళ్లతో కట్టేసి పొలంలోనే లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకొని స్థానిక కోర్టుకు హాజరుపర్చగా ఏడు రోజుల రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె దవాఖానలో చికిత్స పొందుతోందని, పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు చెప్పారు.