కొడుకు పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో అన్యాయంగా తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. నిందితులు కారుతో గుద్ది, కారం చల్లి గొడ్డళ్లతో నరికి హత్య చేశారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామంలో బుధవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.
గ్రామానికి చెందిన వీరయ్య(55) చిన్న కొడుకు పరమేశ్.. అదే గ్రామానికి చెందిన భర్త,ఇద్దరు పిల్లలు ఉన్న ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. నెల రోజుల కింద ఆమెను ఏపీలోని గురజాలకు తీసుకెళ్లి సహజీవనం చేశాడు.వారి ఆచూకీ తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడికి వెళ్లి యువకుడిని చితకబాది, సదరు మహిళను తీసుకువచ్చారు. ఈ విషయంలో ఆగ్రహంగా ఉన్న మహిళ బంధువులు, మంగళవారం వీరయ్య, తన పెద్ద కొడుకు వెంకటేశ్‌తో కలిసి అచ్చంపేట నుంచి నడింపల్లికి బైకు మీద వెళ్తున్న విషయాన్ని గుర్తించారు.
దీంతో ఇటుక బట్టీల వద్ద మాటు వేసి కారుతో ఢీకొట్టారు.అనంతరం వారి కళ్లల్లో కారం చల్లి సుత్తి, గొడ్డలితో దాడి చేశారు. వీరయ్య అక్కడికక్కడే చనిపోగా, స్వల్ప గాయాలతో వెంకటేశ్ తప్పించుకున్నాడు.విషయం తెలుసుకొని హైదరాబాద్ – అచ్చంపేట ప్రధాన రహదారిపైనే డెడ్ బాడీని ఉంచి గ్రామస్థులు రాస్తారోకో చేపట్టారు.