నవంబర్ 1 వరకు అమెరికాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేయాలని ట్రంప్ సర్కారు ఆ దేశ రాష్ట్రాలను ఆదేశించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 2 రోజుల ముందు నుంచి.. అంటే నవంబర్ 1 నుంచి కరోనా వ్యాక్సిన్‌ను పంపిణీ చేయదలిచామని అందుకు గాను రాష్ట్రాలు అన్ని ఏర్పాట్లు చేయాలని ట్రంప్ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించింది.
కాగా అమెరికాలో ప్రస్తుతం 3 వ్యాక్సిన్లకు ఫేజ్ 3 ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకాలకు చెందిన వ్యాక్సిన్‌తోపాటు, మోడెర్నా కంపెనీ వ్యాక్సిన్, ఫైజర్, బయోఎన్‌టెక్ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన వ్యాక్సిన్‌కు ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఇక ఈ వ్యాక్సిన్ల ఉత్పత్తికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే అమెరికాలో ముందుగా అత్యవసర సేవలను అందించే సిబ్బందితోపాటు కోవిడ్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉన్న అందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. తరువాత ప్రజలందరికీ వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనున్నారు.