ప్రపంచంలోనే అత్యంత హ్యాపియెస్ట్ దేశంగా పేరుగాంచిన ఫిన్‌లాండ్‌లో ఇకపై తల్లిదండ్రులిద్దరీ సమానంగా పేరెంటల్ లీవ్ ఇవ్వనున్నారు. ఇంతకు ముందు అక్కడ ప్రసవించిన మహిళలకు 4 నెలలు, ఆమె భర్తకు 2 నెలల పేరెంటల్ లీవ్‌లను ఇచ్చే వారు. అయితే ఇకపై ఇద్దరికీ విడివిడిగా 7 నెలల వరకు పేరెంటల్ లీవ్‌ను ఇవ్వనున్నారు. ఈ మేరకు ఫిన్‌లాండ్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.
ఫిన్‌లాండ్ తీసుకున్న సదరు నిర్ణయాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి అక్కడ అమలు చేయనున్నారు. అయితే మహిళకు భర్త లేకపోతే ఆమె ప్రసవించినప్పుడు ఆమెకు భర్త సెలవులు 7 నెలలు కలిపి ఇస్తారు. అంటే 7+7=14 నెలల పేరెంటల్ లీవ్‌ను అలాంటి మహిళలు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇక భర్త ఉన్నప్పటికీ తనకు లీవ్ అవసరం లేదనుకుంటే అతను తన లీవ్‌లను తన భార్యకు ఇవ్వవచ్చు. దీంతో అలాంటి సందర్భంలో కూడా మహిళ తన భర్త లీవ్‌లను అన్నింటినీ వాడుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఫిన్‌లాండ్ నిజానికి ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే అందుకు అక్కడి ప్రధాని కారణమని చెప్పవచ్చు. కేవలం 34 ఏళ్ల వయస్సులోనే ఆ దేశానికి ప్రధాని అయిన సన్నా మారిన్ అనే మహిళ, తన మహిళా మంత్రులు కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఏది ఏమైనా ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు ఫిన్‌లాండ్ దేశ ప్రభుత్వాన్ని అందరం అభినందించాల్సిందే..!