అమెరికాలో ఆశ్రయం కోసం సొంత దేశాన్ని వదిలి వెళ్దామని ఆశగా ఎదురుచూస్తున్న 39 మంది అగ్నికి ఆహుతయ్యారు. మెక్సికోలోని ఓ వలసదారుల కేంద్రంలో ఇవాళ జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో వీరంతా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా-మెక్సికో సరిహద్దులోని చిహువాహువా రాష్ట్రం సియుడాడ్ జువారెజ్లోని వలసదారుల కేంద్రంలో జరిగిందీ దుర్ఘటన.
వేర్వేరు దేశాల నుంచి మెక్సికోకు వచ్చే వలసదారులు.. అమెరికాలోకి ప్రవేశించేందుకు సియుడాడ్ జువారెజ్ ముఖ్యమైన ప్రాంతం. అగ్రరాజ్యం ఆశ్రయం కోరిన అనేక మంది.. అధికారిక ప్రక్రియ పూర్తయ్యేవరకు ఇక్కడి వలసదారుల కేంద్రంలోనే ఉంటారు. ఇవాళ రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏం జరుగుతుందో తెలిసేలోపే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు దగ్గర్లోని 4 వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై మెక్సికో అటార్నీ జనరల్ కార్యాలయం దర్యాప్తునకు ఆదేశించింది.