కేరళలోని పతనంథిట్ట జిల్లాలో అయ్యప్ప యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో సుమారు 62మందికి పైగా భక్తులు గాయపడ్డారు. వీరంతా తమిళనాడులోని మయిలాదుతురై జిల్లాకు చెందిన వారిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.
శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకున్న అనంతరం భక్తులతో వస్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలోకి జారి పడింది. ఇవాళ మధ్యాహ్నం 1.30 గంట సమయంలో నిలక్కల్ సమీపంలోని ఎలావుంకల్ వద్ద ఈ ఘటన జరగింది. ప్రమాదం సమయంలో బస్సులో తొమ్మిది మంది చిన్నారులతో పాటు 64 మంది ఉన్నట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఉన్న వారిలో 62మందికి గాయాలు కాగా.. వీరిలో కొందరికి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. వారిని మెరుగైన వైద్యం కోసం తరలించినట్టు పేర్కొన్నారు.