దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాజౌరీ గార్డెన్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న జంగిల్ జంబూర్ రెస్టారెంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో.. భారీగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి బయటకు పరుగులు తీశారు. మరి కొంత మంది రెస్టారెంట్ పై అంతస్థుకు ఎక్కారు. కాగా.. ఈ అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే 10 అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి చేరుకుని వెంటనే మంటలను అదుపులోకి తీసుకోచ్చారు.
60 మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసి తర్వాత.. భవనంలో పొగలు భారీగా కమ్ముకున్నాయి. దీంతో.. పక్కనే ఉన్న దుకాణాదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మంటల కారణంగా సమీపంలోని దుకాణాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఉన్నాయి. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా..? అగ్నిప్రమాదానికి గల కారణాలు గురించి ఇంకా తెలియరాలేదు.