భారత్-శ్రీలంక India-Sri Lanka ల మధ్య రేపు (ఆదివారం) తొలి వన్డే జరగనుంది. కొలొంబోలోని ప్రేమదాస స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టెస్టు జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా… శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టుకు శిఖర్ ధావన్ సారథ్యం వహిస్తున్నాడు. మొత్తం 20 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో చాలా మంది యువ ఆటగాళ్ళు ఉండడంతో తుది జట్టులో చోటు ఎవరికి దక్కుతుందనే విషయం ఆసక్తిగా మారింది.
తుది జట్టు విషయానికి వస్తే… కెప్టెన్ ధావన్, పృథ్వీ షాలు ఇన్నింగ్స్ ఆరంభించడం ఖాయం. రెండు, మూడు స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండేలకు చోటు దక్కే అవకాశం ఉంది. వికెట్ కీపర్ గా సంజు శాంసన్‌కు అవకాశం ఇస్తారా లేదా ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇస్తారా అనేది ఆసక్తిగా మారింది. హార్దిక్ పాండ్యాకు తుది జట్టులో చోటు ఖాయం కాగా ఆల్ రౌండర్ కోటాలో కృనాల్ పాండ్యాకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. స్పిన్నర్ల విషయానికి వస్తే యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్‌లలో చాహల్‌కే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. పేస్ విభాగంలో భువనేశ్వర్, దీపక్ చాహర్‌లకు తుది జట్టులో స్థానం ఖాయం కాగా… మూడో పేసర్ గా నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియాలలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది.
భారత పూర్తి జట్టు: శిఖర్ ధావన్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్(వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్య, నితిష్ రాణా, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సంజు శాంసన్(వికెట్ కీపర్),యజువేంద్ర చాహల్, రాహుల్ చాహర్, కె.గౌతమ్, కృనాల్ పాండ్య, కుల్‌దీప్ యాదవ్, వరణ్ చక్రవర్తి, దీపక్ చాహర్, నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియా