ఫ్లాష్ క‌ట్ : ఎన్టీఆర్ గొప్ప‌త‌నం చెప్పిన ఆర్టిస్టు

-

ఎన్నో రంగులు, రేఖ‌లు మాట్లాడి వెళ్లిన విధంగా ఉంటుంది జీవితం. జీవితం నుంచి జీవితం వ‌ర‌కూ క‌ళ ఒక విస్తృతిలో ఉంటుంది. ఉద్ధృతిని పొంది ఉంటుంది. ఆ విధంగా ఎన్నో ప‌నులకు శ్రీ‌కారం దిద్దిస్తుంది. అలాంటి కోవ‌లో ఎన్టీఆర్.. ద గ్రేట్ ఎన్టీఆర్. ఆయ‌న గురించి మ‌రో మంచి చిత్ర కారులు శివ ప్ర‌సాద్ దాకోజు.. త‌న అనుభ‌వాల‌ను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అన్న‌గారితో ఎంతో సాన్నిహిత్యం ఉన్న వ్య‌క్తి ఆయ‌న..ఆయ‌న క‌థ ఆయ‌న మాట‌ల్లోనే చ‌ద‌వండిక.

తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్ళు అని అందరూ చెప్పే మాట.ఇది అందరికీ తెలిసిన మాట. అందరూ ఆనందించే మాట. ఎన్టీఆర్ వందేళ్ల వేడుకలు రాబోతున్న సందర్భంగా వీరివురూ నా విషయంలో స్పందించిన తీరు మీ ముందుంచుతాను.

ఆప్తులారా! అప్పుడు నాకు 17 యేళ్ళ వయసు. ఖైరతాబాద్ మార్కెట్ దగ్గరలో మా నాన్న లక్ష్మణరావుగారు బంగారం పని చేసేవారు. అప్పుడప్పుడు నేను కొట్టు దగ్గరకు వెళ్ళేవాడిని. అక్కడ మా నాన్నగారి ఫ్రెండ్స్ లో ఒక యువ విద్యావంతుడు నేను వేసిన బొమ్మలు చూసి…అరే ! బొమ్మలు భలే వేస్తున్నారే.అచ్చు రామారావులా, నాగేశ్వరరావులానే వేశారు. నాగేశ్వరరావు వాళ్ళిల్లు నాకు తెలుసు. ఏమన్నా ఉద్యోగం ఇస్తాడేమో ప్రయత్నిద్దాం అన్నాడు. సరేనని ఒకరోజు పొద్దున్నే వెంకటరమణా కాలనీ లోంచి చిన్న చిన్న కొండలు,గుట్టల మీదుగా ఏఎన్నార్ ఇంటికి తీసుకెళ్ళాడాయన.

మేము చూస్తుండగా కారు బయటికి వొచ్చింది. వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్-లో పెట్రోల్ కొట్టిస్తున్నారు ఏఎన్నార్. నన్ను తీసుకొచ్చినాయన నన్ను వారిముందు నిలబెట్టాడు. చూపించండి అన్నాడు. పెన్సిల్ తో వేసిన రెండు ఎన్నార్ బొమ్మలు వారి చేతిలో పెట్టాను. మెడకి వెడల్పాటి బెల్టు పెట్టుకున్న ఆయన బొమ్మలు చూసి నిర్లిప్తంగా వెనక్కి ఇచ్చేశారు. మాట్లాడండి అంటున్నాడు వెనక నుంచి ఈయన. మీరేమన్నా సాయం చేయాలండీ అన్నాను. రోజుకు నీలాంటివాళ్లు ఎందరో వస్తుంటారు. ఎంత మందికని సాయం చేస్తాం చెప్పు అన్నారు..వారి స్టయిల్లో యాచకుల్ని చూసినట్టు చూస్తూ…మీ అన్నపూర్ణ స్టూడియోలో ఏమన్నా ఉద్యోగం అనే లోపల వేగంగా వెళ్ళిపోయారు.

అదేంటండీ…బొమ్మ బాగుందీ లేదనే చిన్నమాటయినా చెప్పకుండా వెళ్ళిపోయాడే అంటాడు విద్యావంతుడు. తప్పు వారిది కాదండీ మనదే అన్నాను. ఇప్పటి కంటే అప్పుడు ఎక్కువ స్థిమితంగా ఉండేవాడిని. ఎవరినీ ఏమీ అనేవాడిని కాదు. కాలం గడుస్తోంది. ఈనాడులో ఉద్యోగం వచ్చింది. ఎలాగైనా సినిమాల్లో పని చెయ్యాలి అనే కోరికతో మా నాన్నగారి గుడివాడ ఫ్రెండ్ మసికట్టు అప్పారావు గారి ద్వారా ఏఎన్నార్-ని కలిసినట్టే, ఎన్టీఆర్-ని కలిసి యథావిధిగా బొమ్మలు వారి చేతిలో పెట్టాను. బొమ్మలు చూసి ఏం నా బొమ్మ వేస్తివి అని సంతోషించి, న‌న్నెంతో మెచ్చుకున్నారు.

వెళ్ళింది సాయం కోసమేగా..! అదే అడిగాను. అలాగా..అని పది గంటలకి సెట్లోకి రమ్మన్నారు. వెళ్ళాను. అప్పుడు అక్బర్ – సలీం – అనార్కలి సినిమా సెట్ లో పని జరుగుతోంది. ఆ సినిమా ఆర్ట్ డైరెక్టర్ మూర్తి గారు. మూర్తి గారిని పిలిచి ఎన్టీఆర్ నన్ను వారికి చూపించి…వారు బొమ్మలేస్తారట! నేనూ బొమ్మలేస్తాను. వారి బొమ్మలు మీకెంతవరకు ఉపయోగపడతాయో చూడండి అని నన్ను వారికి అప్పగించారు. మూర్తిగారు నన్ను చాలా గౌరవంగా చూసేవారు. ఇప్పుడు చెప్పండి పై మాట కరెక్టేనా? జై ఎన్టీఆర్…జైజై ఎన్టీఆర్…జయహోఎన్టీఆర్‌..

– శివ ప్ర‌సాద్ దాకోజు, సీనియ‌ర్ ఆర్టిస్ట్‌, హైద్రాబాద్

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version