దిల్లీని పొగమంచు కమ్మేసింది. ఈ మంచు వల్ల పలు విమానాలు, రైళ్లు, ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనివల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దిల్లీ -ఖాట్మండు, దిల్లీ-జైపూర్, దిల్లీ-సిమ్లా, దిల్లీ-డెహ్రాడూన్, దిల్లీ-ఛండీగఢ్-కులూ మధ్య తిరగాల్సిన విమానాలు ఆలస్యంగా బయల్దేరనున్నాయి. దాదాపు 40 డొమెస్టిక్ ఫ్లైట్స్ ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు రావాల్సిన 18 విమానాలు కూడా ఆలస్యంగా రానున్నాయి.
ఇవాళ తెల్లవారుజామున 5:30 గంటలకు సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీ వద్ద 7.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, పాలం వద్ద 8.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఉదయం 8:30 గంటల సమయంలో పాలం వద్ద 7.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, 50 మీటర్ల వరకు మాత్రమే విజిబిలిటీ కనిపించింది. సఫ్దర్‌జంగ్ వద్ద 6.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, 200 మీటర్ల వరకు విజిబిలిటీ కనిపించింది. ఢిల్లీ వ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉండటంతో బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.