మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో కొత్త దందా వెలుగులోకి వచ్చింది. అదేంటంటే కల్యాణలక్ష్మి పథకంలో ఫోర్జరీ సంతకాలతో కూడిన నకిలీ ధ్రువ పత్రాలతో లబ్ది పొందేందుకు ఓ ముఠా కుట్ర పన్నింది. డాక్టర్ సంతకాన్ని ముఠా ఫోర్జరీ చేసింది. అయితే అది తన సంతకం కాదని డాక్టర్ తేల్చి చెప్పినట్టు సమాచారం. ఇప్పటి వరకు 7 నకిలీ పత్రాలతో కూడిన దరఖాస్తులని గుర్తించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు రహస్య విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. పేదింట ఆడపిల్ల పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు ఇబ్బందులు పడొద్దని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్యాణలక్ష్మీ, ముస్లిం మైనార్టీలకు షాదీముబారక్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ప్రవేశ పెట్టింది. ఈ ఆర్థిక సాయాన్ని ముందు 51 వేలు ఇచ్చే వారు తరువాత రూ.75,116కు పెంచారు. తాజాగా దానిని 1,00,116 కు కూడా పెంచారు. తెలంగాణ రాష్ట్రం లోని దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన నిరుపేద యువతుల వివాహాల కోసం రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.