బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్.కే. అద్వానీ మరోసారి ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. న్యూరాలజిస్ట్ డాక్టర్ వినిత సూరి ఆధ్వర్యంలో అడ్మిట్ అయినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
అద్వానీ గత నెల జులై లో కూడా అనారోగ్యంతో ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. అంతకు ముందు ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో కూడా చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం అద్వానీ వయస్సు 96 ఏళ్ళు. వయస్సు మీద పడటంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయని.. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమి లేదని వైద్యులు వెల్లడించారు. అద్వానీ బీజేపీ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆయన 2002 నుంచి 2004 వరకు ఉప ప్రధానిగా, 1999 నుంచి 2004 వరకు కేంద్ర హోంశాఖ మంత్రిగా పని చేశారు. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ ప్రధానీ అభ్యర్థిగా ఉన్నారు. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించలేకపోయింది.