భూవివాదం నేపథ్యంలో యూపీలో 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యేను ప్రత్యర్థులు కొట్టి చంపారు. లకీంపూర్ ఖేరీలో ఆదివారం ఈ ఘటన జరిగింది. మాజీ ఎమ్మెల్యే నిర్వేంద్ర కుమార్ మిశ్రా తన కుమారుడితో కలిసి వెళ్తున్న సమయంలో త్రికోలియా బస్టాప్ వద్ద కాపుగాసిన దుండగులు వారిపై కర్రలతో దాడికి దిగారు. గాయాలపాలైన నిర్వేంద్రని, ఆయన కుమారుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. నిర్వేంద్ర కుమార్ ప్రాణాలు విడిచారు. దీంతో నిర్వేంద్ర మిశ్రా మృతదేహాన్ని రహదారిపై ఉంచి ఆయన కుటుంబసభ్యులు, మద్దతుదారులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. అలాగే ఈ విషయమై సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ నేతలు స్పందిస్తూ.. సీఎం యోగి ఆదిత్యనాథ్ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఐతే నిర్వేంద్రకు సమీర్ గుప్తా, రాధేశ్యామ్ గుప్తా అనే వ్యక్తులతో భూవివాదాలున్నాయి. దీనిపై కోర్టులో కూడా కేసు నడుస్తోంది. ఈ క్రమంలో వారి అనుచరులే కొట్టిచంపారన్న ఆరోపణలు వినినిస్తున్నాయి. ఇకపోతే నిర్వేంద్ర కుమార్ మిశ్రా గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. నిఘాసన్ నియోజవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహించారు. రెండు సార్లు ఇండిపెండెంట్‌గా, ఒకసారి సమాజ్‌వాదీ పార్టీ తరపున గెలుపొందారు నిర్వేంద్ర.