రాష్ట్రంలో బీజేపీది ఏదారి ? ఇప్పుడు ఇదే కీలక ప్రశ్నగా మారింది. నిన్న మొన్నటి వరకు రెండు మూడు వర్గాలుగా ఉన్న బీజేపీలో ఒకరంటే ఒకరికి పడేది కాదు. దీంతోనే పార్టీ ఎదుగు బొదుగు లేకుండా పోయిందనే వాదన ఉంది. ఈ క్రమంలోనే ఎన్నో ఊహించుకుని కన్నా లక్ష్మీనారాయణకు పగ్గాలు అప్పగించింది బీజేపీ. నిజానికి అప్పట్లో కాపుల గాలి ఎక్కువగా ఉండడంతో ఈ గాలిని బీజేపీ వైపు తిప్పుతారని భావించారు. కానీ, కన్నా విఫలమయ్యారు. పైగా పార్టీలో కమ్మ, కాపు వర్గంగా రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. వీరిలోనూ మరో వర్గం ఏర్పడి.. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సంబంధాలు కొనసాగించే వర్గం ఒకటి. ఇక ఏపీలో సీఎం జగన్‌కు అనుకూలంగా వ్యవహరించే వర్గం ఒకటి… ప్రతిపక్ష నేత చంద్రబాబు కనుసన్నల్లో మెలిగే వర్గం మరొకటి.
మొత్తంగా మూడు వర్గాలు ఏర్పడినా.. పార్టీని బలోపేతం చేసేందుకు ఏ ఒక్క వర్గమూ ముందుకు రాలేదు. ఇదే విషయాన్ని దివంగత మాజీ మంత్రి మాణిక్యాలరావు పదే పదే చెప్పారు. పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయని ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ, ఆ దిశగా ఏ ఒక్కరూ చర్యలు తీసుకోలేక పోయారు. ఫలితంగా పార్టీ పరిస్థితి నానాటికీ గండంగానే మారిపోయింది. ఇక, అమరావతి విషయం తెరమీదికి వచ్చేసరికి.. ఈ గ్రూపులు మరింతగా పెరిగిపోయాయి. రాజధానికి అనుకూలంగా మాట్లాడిన వర్గం ఒకటైతే.. వ్యతిరేకించిన వర్గం మరొకటి. ఏకంగా జగన్‌తోనే తెరచాటు ఒప్పందం చేసుకున్న నాయకులుమరో వర్గంగా మారిపోయారు.
ఇంకా చెప్పాలంటే 2014లో కేంద్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఈ రెండు వర్గాలు నడుస్తూనే ఉన్నాయి. ఈ గ్రూపుల గోల ఆరేళ్లలో రోజు రోజుకు పెరగుతోందే తప్పా ఎక్కడా తగ్గడం లేదు. దీంతో పార్టీలో కొత్త రక్తం.. అది కూడా ఆర్ ఎస్ ఎస్ మూలాలు ఉన్న నాయకుడికి పార్టీ పగ్గాలు అప్పగించాలని భావించిన అధిష్టానం ఎట్టకేలకు సోము వీర్రాజును తీసుకువచ్చారు. దీంతో గ్రూపులకు తెరపడుతుందని అనుకున్నారు. కానీ, అసలు చిక్కులు ఇప్పుడు ఎదురయ్యాయి.
సోము వచ్చీరావడంతో ఇంకా పగ్గాలు కూడా చేపట్టకుండానే మీడియా చానెళ్లలో అనుమతి లేకుండా మాట్లాడుతున్నారంటూ.. తనకు వ్యతిరేకంగా ఉన్న వర్గంపై కొరడా ఝళిపించడం ప్రారంభించారు. ఇక, అమరావతి విషయంలో మా పాత్రలేదని చెప్పడం ద్వారా అనుకూల వర్గానికి ముకుతాడు వేసేశారు. అదే సమయంలో తన వర్గాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో మొత్తంగా నాలుగు వర్గాలు రెడీ అయ్యాయనే ప్రచారం ప్రారంభమైంది. మరి మున్ముందు ఇంకెన్ని రకాలుగా కమల వికాసం ఉంటుందో చూడాలి.