పరువు హత్య : మా అమ్మాయినే పెళ్లి చేసుకుంటావా.. అంటూ..

-

కులం కాని యువకుడు తమ ఇంటి కూతురుని పెళ్లి చేసుకున్నాడని కొందరు దుండగులు హతమార్చిన ఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాళ్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా మర్పల్లికి చెందిన ఓ యువకుడు (25), అదే జిల్లా పోతిరెడ్డిపల్లి మండలం మర్పల్లి ఘనపూర్‌కు చెందిన యువతి (23) కళాశాలలో స్నేహితులు. అయితే వారి స్నేహం కాస్తా ప్రేమగా మారింది.దీంతో వేర్వేరు మతాలకు చెందిన వీరు పెద్దలకు ఇష్టం లేకుండా ఓల్డ్‌ సిటీ లాల్‌దర్వాజాలోని ఆర్య సమాజంలో ఈ ఏడాది జనవరి 31న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకున్న జంట సరూర్‌నగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు.

బుధవారం రాత్రి 9గంటల సమయంలో దంపతులిద్దరూ బైక్‌పై వీఎం హోం నుంచి సరూర్‌నగర్‌ పోస్టాఫీస్‌ వైపు వెళుతుండగా.. అదే సమయంలో బైక్‌పై వచ్చిన దుండగులు బైక్‌ను ఆపారు. యువకుడి హెల్మెట్‌ను తీయించి సెంట్రింగ్‌ రాడ్‌తో అతనిపై విచక్షణా రహితంగా దాడి చేయడంతో.. యువకుడు తీవ్రంగా గాయపడిన అతను రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. స్థానికులు ఆ భయానక ఘటన చూసి షాక్‌కు గురయ్యారు. మతాంతర వివాహం నేపథ్యంలో యువతి బంధువులే ఈ పాశవిక హత్యకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పెళ్లి జరిగిన నాటి నుంచి కక్ష పెంచుకున్న యువతి సోదరుడు, అతని బావలు కలిసి యువకుడిని హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. ఇటీవల యువతి తరఫు బంధువులు తమను వెంబడించడంతో, తమకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ దంపతులు వికారాబాద్, బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. హత్యోదంతం తెలుసుకున్న ఎల్‌బీనగర్‌ క్రైమ్‌ డీసీపీ యాదగిరి, ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, సరూర్‌నగర్‌ సీఐ సీతారాం, ఎస్‌ఐ లక్ష్మయ్య ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హత్యకు ప్రేమ వివాహమే కారణమని, నిందితులను త్వరలో అరెస్ట్‌ చేస్తామని ఏసీపీ వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version