సాధారణంగా మనకంటే ఎవరైనా బాగా చదివినా.. ఉన్నత స్థాయిలో ఉన్నా కొందరిలో కాస్త అసూయ కలుగుతుంది. కొన్ని సార్లు అది తీవ్రస్థాయికి చేరి వాళ్లపై కారణం లేకుండా అసహ్యం కలిగేలా చేస్తుంది. అది పరిధులు దాటితే మాత్రం చాలా దారుణమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. అలాంటి ఘటనే ఛత్తీస్‌గఢ్ దుర్గ్‌లో జరిగింది.
కబడ్డీ బాగా ఆడుతున్నాడన్న అసూయతో 12 ఏళ్ల బాలుడిని అతడి ఇద్దరు స్నేహితులు హత్య చేశారు. మృతుడిని సమీర్ సాహుగా పోలీసులు గుర్తించారు. అక్టోబరు 21న జరిగిన ఈ మర్డర్ కేసును పోలీసులు తాజాగా ఛేదించారు.
మృతుడు, నిందితులు కలిసి కబడ్డీ ఆడుకునేవారు. సమీర్ సాహు కబడ్డీ మెరుగ్గా ఆడేవాడు. ఈ విషయంలో అతడి స్నేహితులను హేళన చేసేవాడు. దీంతో అతడిపై కోపం పెంచుకున్న ఇద్దరు మైనర్ స్నేహితులు సమీర్‌ను కిడ్నాప్ చేశారు. అనంతరం ఓ నర్సరీకి తీసుకెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి.. తలపై రాయితో కొట్టి హత్య చేశారు. మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో చుట్టి అక్కడ పడేశారు.
పోలీసులకు నర్సరీ సమీపంలో అక్టోబరు 24న గుర్తు తెలియని మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న దుర్గ్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ మృతదేహం సమీర్ సాహుదిగా గుర్తించి.. స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి కేసును ఛేదించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మృతుడి మైనర్ స్నేహితులు ఇద్దరినీ ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. నిందితులిద్దరూ వారు చేసిన నేరాన్ని పోలీసులు ఎదుట అంగీకరించారు. నిందితులిద్దరినీ బాలల కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.