తెలంగాణలో ఆ ప్రజాప్రతినిధులను పట్టించుకునే వారే కరువయ్యారా

-

లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ ప్రజాప్రతినిధులను ఎవరు పట్టించుకోవడం లేదట.తెలంగాణలో కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగి సంవత్సరం గడుస్తుంది. ఇప్పటి వరకు ఆయా సంస్థలకు ఒక్క పైసా ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదట.. దీంతో కొత్తగా ఎన్నికైనా ఆ మేయర్లని పట్టించుకునే నాథుడే కరువయ్యాడట. రాష్ట్ర రాజధానితోపాటు శివారులో ఏడు కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీరంత నిధుల సమస్యతో ఉత్సవ విగ్రహాలుగా మారారట.

తెలంగాణలో కొత్తగా పదుల సంఖ్యలో మున్సిపల్ కార్పొరేషన్లు, వందల సంఖ్యలో మున్సిపాలిటీలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 2018 తరువాత 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు వచ్చాయి. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. గతంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లకే నిధులు లేక అభివృద్ధి కుంటుపడుతుంటే కొత్తవి ఏర్పాటు చేసి వాటికి ఎన్నికలు సైతం నిర్వహించారు.

ఎన్నికల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసిన మేయర్లు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. తామంటే ఎవరికి లెక్కలేకుండా పోతుందని అనుచరులతో చెప్పుకొని మదనపడుతున్నారు మేయర్లు. భాద్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక విపత్తు తలెత్తుతుందని… మార్చి నెల నుంచి అక్టోబర్ వరకు కరోనా, లాక్ డౌన్ ఆ తరువాత హైదరాబాద్ లో వరదలు వచ్చి అనేక ఇబ్బందులు పడ్డామన్నది వారి ఆవేదన. అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెడదామంటే ప్రజలు కట్టే పన్నులు తప్ప ఇతర ఆర్థిక కార్యకలాపాలు ఏమి లేవని చెబుతున్నారు.

మెజార్టీ కార్పొరేషన్లలో చాలా శాఖల్లో ఖాళీలు భర్తీ చేయలేదు. అవుట్ సోర్సింగ్ సిబ్బందితో పనులు చేయిస్తున్నారు. మేయర్లకు ఎలాంటి అధికారాలు లేవు. సవరించిన మున్సిపల్ చట్టం ప్రకారం చెక్ పవర్ కూడా పూర్తిగా కమిషనర్లకే అప్పగించారు. కొత్తగా బిల్డింగ్ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదు..సామాన్య ప్రజలు కార్పొరేషన్‌కు వచ్చి ఏదైనా పని చేయలేదని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి మేయర్లకు ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో పెత్తనం అంతా స్థానిక ఎమ్మెల్యేలే చేస్తున్నారని మేయర్లు వాపోతున్నారు.

కమిషనర్లు కూడా స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు చెప్పిన మాటలే వింటున్నారట. అలాంటప్పుడు ఎన్నికలు నిర్వహించడం ఎందుకు తమను మేయర్లుగా ఎన్నుకోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాలు భారీగా ఉంటున్నాయని.. వాటిని చేరుకోవడం తమకు తలకు మించిన భారంగా మారిందని కొందరి వాదన. ప్రతిపక్ష పార్టీలకు చెందిన మేయర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేషన్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉందట. మరి వీరిని తెలంగాణ సర్కార్ ఎలా బయట పడేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version