కాంగ్రెస్ లో ఏం జరిగిన పెద్ద రచ్చ లాగానే ఉంది..మొన్నటివరకు పార్టీలో పదవులు భర్తీ చేయలేదనే రచ్చ జరిగింది..అలాగే ఢిల్లీలో కొన్ని రోజుల పాటు ఈ పదవులకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఎవరి లాబీయింగ్‌లు వారు చేశారు. చివరికి పదవుల భర్తీ పూర్తి అయింది..అందరి నేతలని కవర్ చేసేలా పదవులు ఇచ్చారు. అయితే కొందరికి పదవుల పంపకాలపై ఇబ్బంది వచ్చింది. ముఖ్యంగా సీనియర్ నేతలు ఈ పదవులపై గుర్రుగా ఉన్నారు. జూనియర్ నేతలకు పదవులు ఇచ్చి..తమని చిన్న చిన్న పదవుల్లో పడేశారని ఫైర్ అవుతున్నారు.
ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ కమిటీలో పదవి ఇవ్వడంపై కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే పదవికి రాజీనామా చేశారు. సాధారణ కార్యకర్తగానే పనిచేస్తానని చెప్పారు. అటు బెల్లయ్య నాయక్ సైతం తన పదవికి రాజీనామా చేశారు. అటు దివంగత పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి సైతం తనకు ఏ పదవి దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సైకిల్ పార్టీ నుంచి గాంధీ భవన్ మెట్లు ఎక్కని వారికి పదవులు వస్తున్నాయని, కానీ తమకు ఎలాంటి పదవి దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక తాజాగా భట్టి విక్రమార్క సైతం పదవుల భర్తీ తనకు తెలియదని, తనని ఎవరు సంప్రదించలేదని చెప్పుకొచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్‌కు కోవర్టిజమనే కొత్త రోగం పట్టుకుందని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. గత 8 ఏళ్లుగా కాంగ్రెస్‌లో కోవర్టిజం కొనసాగుతుందని, కోవర్టులకు పదవులు ఇస్తున్నారని..సిద్దిపేట జిల్లాలో కోవర్టులకే పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. కావాలనే కోవర్టులను ప్రోత్సహిస్తున్నారని ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ పదవుల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ముస్లింలకు చోటు కల్పించలేదని, పీసీసీ కమిటీల్లో అనర్హులకు పదవులు ఇచ్చారని మండిపడ్డారు. అయితే ఈ పదవుల పంపకాలపై సీనియర్లు పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. కొందరు రాజీనామాలు చేస్తున్నారు..మరికొందరు పార్టీని వీడటానికి కూడా వెనుకాడటం లేదు.