P4 లోని అంశాలు కేంద్రం ఆలోచనలేనివేనని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారానే ప్రగతి సాధ్యం అవుతోందని స్పష్టం చేశారు. ఏపీలో అభివృద్ధికి తావు లేకుండా వైసీపీ పాలన సాగిందని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం అప్పుల ఊబీలోకి రాష్ట్రాన్ని నెట్టేసిందన్నారు. రహదారులను అధ్వాన్న స్థితికి చేర్చింది. రాష్ట్రంలోని యువతకు ఉపాధి దక్కలేదని.. మద్యం మాఫియాతో వైసీపీ నేతలు భారీగా డబ్బులు చేసుకున్నారని ఆరోపించారు.
బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితో రాష్ట్రాభివృద్ది సాధ్యమవుతుందన్నారు. దేశానికి ఎన్డీఏ కూటమి సుపరిపాలన అందిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రం విషయంలోనూ మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమన్వయంతో ముందుకెళ్తున్నారని తెలిపారు. ఆగిపోయిన పోలవరం ప్రాజెక్ట్ కి రూ.15వేల కోట్లు ఇచ్చారని.. అమరావతి రాజధానికి రూ.12,500 కోట్లు ఏడీబీ నుంచి.. రూ.11వేల కోట్లు హడ్కో నుంచి ఇస్తున్నారని తెలిపారు. గుంతలమయమైన రహదారుల బాగుకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు.